LOADING...
Andhra News: గుర్రపుడెక్కతో ఎరువు.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తయారీ
గుర్రపుడెక్కతో ఎరువు.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తయారీ

Andhra News: గుర్రపుడెక్కతో ఎరువు.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తయారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కను వినూత్నంగా ఉపయోగించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. సాధారణంగా సాగునీటి కాలువల్లో విపరీతంగా పెరిగే ఈతీగ,నీటి ప్రవాహానికి పెద్ద అడ్డంగా మారుతుంది. దీని వల్ల రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు,ఈ తీగను తొలగించడానికి ప్రభుత్వం ప్రతి ఏడాది భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ప్రత్యేక దృష్టి సారించి, గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి మార్గం తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలో ఉన్న సంపద తయారీ కేంద్రంలో ఈ నూతన ప్రయోగాన్ని ప్రారంభించారు. అక్కడ ప్రత్యేక కుండీల్లో గుర్రపుడెక్కను ఉపయోగించి ఎరువు తయారీ చేపట్టారు.

వివరాలు 

తయారీ విధానం ఇలా 

దీంతో రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించగలిగారు. 3 అడుగుల వెడల్పు, 9అడుగుల పొడవు ఉన్న కుండీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఆ కుండీలలో మొదట గడ్డి పొరను వేసి, ఆపై ముక్కలుగా చేసిన గుర్రపుడెక్కను వేసారు. దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు నుంచి ఎనిమిది పొరలుగా ఇలా సర్చి,21రోజులపాటు అలా వదిలిపెట్టారు. ఆ తర్వాత మైక్రోబయల్‌ కల్చర్‌ను మిశ్రమంలో కలిపి, కంపోస్టింగ్‌ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏడువారాల తరువాత ఆ మిశ్రమాన్ని గుళికలుగా మలచారు. ఎరువు తయారీ సమయంలో క్రిమికీటకాలు ఆకర్షించే అవకాశం ఉండడంతో, తయారీ కేంద్రాన్ని ఇళ్లకు,గోదాములకు దూరంగా ఏర్పాటు చేశారు.

వివరాలు 

తక్కువ సమయంలో.. అధిక నాణ్యత 

సాధారణ సేంద్రియ ఎరువుతో పోల్చితే గుర్రపుడెక్కతో తయారైన ఎరువు రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉందని ప్రయోగాల ద్వారా నిరూపితమైంది. ఈ తీగ త్వరగా కుళ్లిపోతుండటం మరో ప్రయోజనం. పైగా, పశువుల వ్యర్థాలతో తయారయ్యే ఎరువుతో పోలిస్తే ఈ ఎరువులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్, మాంగనీస్, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. అదనంగా, ఈ ఎరువును 6 నెలలపాటు నిల్వ ఉంచుకోవచ్చు.

వివరాలు 

అన్ని పంటలకు అనువైనది 

గుర్రపుడెక్కతో తయారైన ఈ సేంద్రియ ఎరువును మిద్దెపంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌ఫామ్‌, పూల మొక్కలు, వరి, ఉద్యాన పంటలలో ఉపయోగించవచ్చు. ఉపాధితో పాటు ఆదాయ వనరు ఈ ఎరువు తయారీ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించడం ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా,రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువును తక్కువ ధరకు అందిస్తున్నారు. గుర్రపుడెక్కతో తయారైన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా,టన్నుకు రూ.12 వేలు గా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో యూనిట్‌లో 20మందికి 50రోజుల పాటు ఉపాధి లభించే అవకాశం ఉంది. అంతేకాదు,రైతులు కూడా స్వయంగా ఈ ఎరువు తయారు చేసుకోవచ్చని, అధికారులు వారిలో అవగాహన పెంచుతున్నారు.