Page Loader
Banakacharla Project: బనకచర్లపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం.. 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు
12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు

Banakacharla Project: బనకచర్లపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం.. 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్(Godavari - Banakacharla)అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా కేంద్రానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో,ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా 2025 జూలై 16న న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లతో కీలక సమావేశం నిర్వహించారు.

వివరాలు 

ముగ్గురు సభ్యులను ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్

ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదుల జలాల పంపకాలు, బనకచర్ల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర నీటి వివాదాలపై ప్రధానంగా చర్చలు జరిపారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై సాంకేతిక,పరిపాలనా కోణాల్లో సమగ్ర పరిశీలన కోసం ఈ నెల 21లోపు ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది నిపుణులతో కూడిన కేంద్ర జల సంఘం టెక్నికల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ కమిటీలో సభ్యుల పేర్లను పంపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర జల సంఘం సమాచారం పంపింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ తరఫున ముగ్గురు సభ్యులను ప్రతిపాదించింది.

వివరాలు 

తెలంగాణ ప్రభుత్వం నుంచి కమిటీ సభ్యుల పేర్లపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు

ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి పేర్లను కమిటీలో సభ్యులుగా సూచించింది. ఈ రోజే వారి పేర్లను కేంద్ర జల సంఘానికి పంపనున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం నుంచి కమిటీ సభ్యుల పేర్లపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ కమిటీ ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలు, నీటి అందుబాటులో పరిస్థితి, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలను సవివరంగా అధ్యయనం చేయనుంది. అలాగే రెండు రాష్ట్రాలకు న్యాయమైన నీటి పంపకాలు జరిగేలా స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.