Page Loader
Loksabha: లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా

Loksabha: లోక్‌సభలో రచ్చ చేసిన విపక్ష సభ్యులు .. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితా అంశాలపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాలను సమర్పించాయి. సభ ప్రారంభమైన వెంటనే శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చుతుర్వేది, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ విఫలమవడం, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై చర్చ నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ పట్టుబట్టారు. అలాగే, ఈ దాడిపై స్వయంగా ప్రధాని మోదీ స్పందించి వివరణ ఇవ్వాలంటూ డీఎంకే ఎంపీ టీఆర్ బాలు డిమాండ్ చేశారు.

వివరాలు 

ప్రశ్నోత్తరాల అనంతరం మాత్రమే వాయిదా తీర్మానాలు 

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రశ్నలకు ప్రధాని ఎప్పుడో సమాధానం చెప్పారని బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ చర్చ జరగాలని కోరుతూ విపక్షాలు నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితిలో స్పీకర్ ఓం బిర్లా స్పందించి,ప్రశ్నోత్తరాల అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ప్రారంభించమని సభకు తెలియజేశారు. ఎవరైనా తనకు వాయిదా తీర్మానాలను ఇవ్వాలంటే,అవి ప్రశ్నోత్తరాల అనంతరం మాత్రమే సమర్పించాల్సిందిగా స్పష్టం చేశారు. అన్ని అంశాలపైనా సమగ్రంగా, సవివరంగా చర్చించడానికి సభ సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ విపక్ష సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు నిరసన కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.