LOADING...
Amaravati: ఐకానిక్‌ వంతెన నమూనా ఖరారు.. రూ.2,500 కోట్లతో త్వరలో టెండర్లు
ఐకానిక్‌ వంతెన నమూనా ఖరారు.. రూ.2,500 కోట్లతో త్వరలో టెండర్లు

Amaravati: ఐకానిక్‌ వంతెన నమూనా ఖరారు.. రూ.2,500 కోట్లతో త్వరలో టెండర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మెయిన్‌ నేషనల్‌ హైవేతో అనుసంధానించే ఐకానిక్‌ కేబుల్‌ వంతెన నిర్మాణానికి త్వరలో పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వంతెన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఇటీవల సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నాలుగు నమూనాలను ప్రజాభిప్రాయానికి ఉంచి ఓటింగ్‌ నిర్వహించారు. అందులో రెండో ఆప్షన్‌కు సుమారు 14,000 ఓట్లు వచ్చి ముందు నిలిచింది. దీనివైపే సీఎం కూడా మొగ్గు చూపారు. ఇప్పటికే డీజీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్ (డీపీఆర్‌) సిద్ధంగా ఉంది. వంతెన నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

కూచిపూడి 

కూచిపూడి నృత్య భంగిమతో.. 

ఈ వంతెన నమూనాలో కూచిపూడి నృత్య భంగిమను ప్రతిబింబించేలా రూపొందించారు. ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు జంట పైలాన్లుగా ఉంటుంది. స్వస్తిక ఆకారంలో ఉండే ఈ నమూనా, స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిప్పన్‌ కోయి లిమిటెడ్‌ తయారు చేసింది. భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు వరుసలుగా నిర్మించనున్నారు. రెండు వైపులా కాలి బాటలు ఉంటాయి. అమరావతి రాయపూడి నుండి కృష్ణానది గుండా ఎన్‌హెచ్‌-65 వద్ద మూలపాడు వరకు మొత్తం 5.22 కి.మీ పొడవుగా ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1,387 కోట్లు కేటాయించి ఎన్‌10 నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్‌ వంతెన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.

వివరాలు 

ఎన్‌హెచ్‌-65 వద్ద ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ 

కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి, కూటమి ప్రభుత్వం స్థలం మార్చింది. పశ్చిమ బైపాస్‌ నిర్మాణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-65 నుంచి అమరావతికి రావడానికి ప్రస్తుత మార్గం సుమారు 40కి.మీ. దూరం ఉండి, మూలపాడు, ఇబ్రహీంపట్నం,గొల్లపూడి,ప్రకాశం బ్యారేజీ ద్వారా రహదారి గుండా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఐకానిక్‌ వంతెన పూర్తయ్యాక ఈ సమస్య పూర్తిగా తొలగనుంది. మూలపాడు నుంచి సుమారు 5కి.మీ మాత్రమే ప్రయాణించి అమరావతికి చేరుకోవచ్చు. దీంతో దూరం 35 కి.మీ. తగ్గడంతో పాటు గంటకు సగం సమయం కూడా ఆదా అవుతుంది. వంతెన ముగింపు వద్ద ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించి, విజయవాడ, హైదరాబాద్‌ వైపు వాహనాలు సులభంగా మారేందుకు వీలుగా చేస్తారు.