Page Loader
Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 
రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు

Fine Rice: రాష్ట్రంలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు.. హోల్‌సేల్‌లో కిలోకు రూ.10-15 తగ్గుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి. ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు ₹500 బోనస్ అందించడంతో, సాగు విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. మార్కెట్‌లో సన్న బియ్యం అందుబాటులో ఎక్కువగా లభించడంతో, ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే ప్రభావం కనిపిస్తోందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు. బోనస్ ప్రకటించే ముందు,రాష్ట్రంలో ప్రీమియం రకం సన్న బియ్యం ధరలు కిలోకు ₹60-₹70 వరకు ఉండేవి. ప్రస్తుతం ఇవి ₹50-₹55కే లభిస్తున్నాయి.అలాగే,ఫైన్ రకం బియ్యం గతంలో ₹55-₹60 ఉండగా,ఇప్పుడు ₹43-₹48 మధ్యగా ఉంది. ఈ ధరలు హోల్‌సేల్ మార్కెట్‌కి సంబంధించినవి.

వివరాలు 

సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన బోనస్‌ పథకం 

గతంతో పోలిస్తే రకాన్ని బట్టి కిలోకు ₹10-₹15 తగ్గాయి. అయితే, రిటైల్ వ్యాపారులు కేవలం ₹5-₹8 మేరకే తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర 'ఏ' గ్రేడ్‌కు ₹2,320, సాధారణ రకానికి ₹2,300. అయితే, తెలంగాణ ప్రభుత్వం సన్న వరి కోసం అదనంగా ₹500 బోనస్ అందించడంతో, మొత్తం కొనుగోలు ధర ₹2,820కి చేరింది. ఈ బోనస్‌ 2024 ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌ నుంచి అమల్లోకి వచ్చింది. 2023 ఖరీఫ్‌తో పోలిస్తే 2024 ఖరీఫ్‌లో సన్న బియ్యం ఉత్పత్తి 50% పెరిగింది. మొత్తం ధాన్యం ఉత్పత్తి 2023-24 ఖరీఫ్‌లో 144.80 లక్షల టన్నులుగా నమోదవగా, 2024-25లో 145.56 లక్షల టన్నులకు చేరింది.

వివరాలు 

ధరల తగ్గుదలపై ఇతర అంశాల ప్రభావం 

ఇందులో 88.39 లక్షల టన్నుల సన్న ధాన్యం కాగా, 57.17 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం. అధిక దిగుబడి కారణంగా మార్కెట్లోకి పెద్ద మొత్తంలో సన్న బియ్యం రావడంతో, ధరలు తగ్గాయి. తెలంగాణలో ప్రతి సీజన్‌లోనూ పొరుగు రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు సన్న బియ్యాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేస్తుంటారు. సరఫరా పెరగడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గినట్లు రైస్ మిల్లర్లు వెల్లడిస్తున్నారు. వేరే రాష్ట్రాల సరఫరా: ఉత్తరప్రదేశ్, ఒడిశా,బీహార్‌ వంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూడా సన్న బియ్యం వస్తోంది. భారత్‌ బ్రాండ్‌ సబ్సిడీ బియ్యం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'భారత్‌ బ్రాండ్‌' పేరిట తక్కువ ధరకు బియ్యం విక్రయాలు ప్రారంభించింది.ఇది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది.

వివరాలు 

ఉగాది తర్వాత మరింత ధరల తగ్గుదల అవకాశం 

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి సన్నద్ధమవుతోంది. దీంతో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ''ప్రస్తుతం బియ్యం మార్కెట్‌ మందగించింది. విక్రయాలు తగ్గాయి. రేషన్ కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు సన్న బియ్యం కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అందరూ ప్రభుత్వ పంపిణీ కోసం వేచిచూస్తున్నారు'' అని తెలంగాణ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి తెలిపారు.