Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్
బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంపై ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఐక్య ఫ్రంట్‌ను రూపొందించడంపై విపక్ష నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాజా దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రతిపక్ష కూటమిని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సబ్ కమిటీ ఏర్పాటుపై చర్చించే అవకాశం
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమికి 'కామన్ మినిమమ్ ప్రోగ్రామ్', కమ్యూనికేష్ కోసం సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సమావేశంలోనే ప్రతిపక్ష కూటమికి పేరు పెట్టాలని కూడా నాయకులు భావిస్తున్నారు. సోనియా గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, హేమంత్ సోరెన్ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశానికి శరద్ పవార్, కె.చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్ దూరంగా ఉన్నారు. పాట్నలో జరిగిన సమావేశంలో 15 వరకు ప్రతిపక్ష పార్టీలు హాజరు కాగా, బెంగళురులో 24 విపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
30మిత్ర పక్షాలతో ఈనెల 18న బీజేపీ సమావేశం
ఒక వైపు శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో సంక్షభం, మరోవైపు పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో హింస చెలరేగడంపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇదిలా ఉంటే, 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి మిత్ర పక్షాలను కలుపుకోవడంపై బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే దృష్టి సారించింది. జులై 18న తమకు మద్దతు ఇచ్చే దాదాపు 30 పార్టీలతో బీజేపీ సమావేశం నిర్వహిస్తోంది. జూన్ 20న పార్లమెంట్ వర్షాకాల సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మీటింగ్‌లకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.