జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. శిబు సోరెన్ ప్రస్తుతం వయసు సంబధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం శిబు సోరెన్‌కు ప్రాథమిక పరీక్షలు జరుగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మేదాంత హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజీత్ సింగ్ వెల్లడించారు. అయన ఇంకా ఆస్పత్రిలో అడ్మిట్ కాలేదని చెప్పారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు సేవలు
శిబు సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. మొదట 2005లో 10 రోజులు (మార్చి 2 నుంచి 12 మార్చి వరకు), ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు సీఎంగా సేవలు అందించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి మిత్రపత్రక్షమైన బీజేపీ మద్దతును ఊపసంహరించుకోవడంతో 2010లో మరోసారి రాజీనామా చేయాల్సి వచ్చింది. 14వ లోక్‌సభలో జార్ఖండ్‌లోని దుమ్కా నియోజకవర్గం నుంచి శిబు సోరెన్ ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం యూపీఏకు మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు అధ్యక్షుడిగా ఉన్నారు.