
DK Shivakumar: 'గాంధీ కుటుంబమే నాకు దైవం': ఆర్‌ఎస్‌ఎస్ గీతం వివాదంపై క్షమాపణలు చెప్పిన డీకే శివకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ఒకవైపు ముఖ్యమంత్రి పదవిలో మార్పు జరుగుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించడం చర్చకు దారి తీసింది. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ వివాదంపై తాజాగా శివకుమార్ తన స్పందనను వెల్లడించారు.
వివరాలు
రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు
''నిజానికి బీజేపీను (BJP) విమర్శించేందుకే ఆ పాటను పాడాను. అయితే దాన్ని కొందరు వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో గందరగోళం రేకెత్తించాలనే ఉద్దేశంతో దీన్ని పెంచిపోస్తున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది నా ఉద్దేశం కాదు. అయినా ఎవరికైనా దీనివల్ల బాధ కలిగితే దానికి చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతాను. కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిడి వలన చెబుతున్న క్షమాపణలు కావు'' అని స్పష్టం చేశారు. అలాగే గాంధీ కుటుంబం,కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత అచంచలమని అన్నారు. ''నేను కాంగ్రెస్‌లోనే పుట్టి, కాంగ్రెస్‌కే అంకితమవుతాను. గాంధీ కుటుంబం నాకు దైవ సమానం. వారిపట్ల నా భక్తి అటు ఇటు కదలదు'' అని పేర్కొన్నారు.
వివరాలు
బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు
ఇటీవల చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమాధానం ఇస్తున్న సందర్భంలోనే డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ''నమస్తే సదా వస్తలే మాతృభూమే'' అంటూ ఆయన పాడిన ఈ గీతం సభను ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. తనపై విపక్షం చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, ఇలాంటి తొక్కిసలాట ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ జరిగాయని తాను రుజువులతో చెప్పగలనని వివరించారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ ఆయనకు మద్దతు తెలపగా, ఆ గీతాన్ని సభ రికార్డుల నుంచి తొలగించరాదంటూ నినదించారు.
వివరాలు
పార్టీలో వ్యతిరేకత పెరిగినప్పుడు.. బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు సందేశాలు
డీకే శివకుమార్ ఇలాంటి చర్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి హాజరైన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం,ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, యడియూరప్పతో తరచూ భేటీలు జరపడం,ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించడం.. ఇవన్నీ ఆయన ప్రత్యేక సంకేతాలు ఇస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో తన నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు లేదా సిఎం మార్పు చర్చలు ప్రస్తుతమయ్యే సమయంలో,బీజేపీతో సాన్నిహిత్యం ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఉంటారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇది తనకు భవిష్యత్తులో బీజేపీ నుంచి అవకాశాలు లభించవచ్చనే సంకేతాన్ని, తన పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న కసరత్తు అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.