Page Loader
Godavari: మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం
మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం

Godavari: మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వచ్చే మూడు రోజులలో తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి వరద ప్రవాహం ఉద్ధృతి పెరిగింది. అలాగే, రాబోయే రెండు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధిక వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీకి సుమారు 9 లక్షల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని, అధికారి కె. గోపీనాథ్ (ఎస్‌ఈ) పేర్కొన్నారు.

వివరాలు 

సముద్రంలోకి 1.85 లక్షల క్యూసెక్కులు 

సోమవారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, సాయంత్రానికి 1,85,143 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 4,200 క్యూసెక్కులు,మధ్య డెల్టాకు 4,200 క్యూసెక్కులు,పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం రేవు వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి రేవులో పంటు వద్దకు వెళ్లే తాత్కాలిక రహదారిని నీళ్లు చుట్టుముట్టాయి. వరద మ‌రింత పెరిగితే ఆ దారి పూర్తిగా మునిగి రాకపోకలు ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రహదారి కొంత భాగం కోతకు గురైంది. సోమవారం రోజున గ్రామస్థులు అర్ధమునిగిన దారిలో భయభయంగా వెళ్లాల్సి వచ్చింది.