Entrepreneur Development Program: ఏపీలో బీసీ, ఈబీసీ, కాపు యువతకు బంపరాఫర్.. ఉచితంగా పారిశ్రామిక శిక్షణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు మద్దతుగా ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
'ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం' పేరుతో యువతకు చేయూత ఇవ్వాలని భావిస్తోంది.
ఈ కార్యక్రమం కింద, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే అవకాశాన్ని కల్పించనుంది.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
Details
4 నుండి 6 వారాల పాటు శిక్షణ
4 నుండి 6 వారాలకు శిక్షణివ్వాలని చూస్తోంది. దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
ప్రతేడాది 2,000 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా తీసుకుని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో 1,000 మంది బీసీ వర్గానికి, 500 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు, ఇక 500 మంది కాపు సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయనున్నారు.
Details
9వేల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రతి బ్యాచ్‌లో 30 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ఏడాది పాటు కొనసాగనున్నాయి.
వచ్చే ఐదేళ్లలో 9వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఇందులో శిక్షణ పొందిన తర్వాత, యువతకు పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది.