
Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాక, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దిల్లీకి వెళ్లారు.
అక్కడ వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
వివరాలు
'భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు'కు 80దేశాల నుంచి ప్రతినిధులు
ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు,మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే అంశాలతోపాటు,ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న'భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు' గురించి కూడా చర్చించారు.
ఈ సదస్సుకు 80దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.అయితే, ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు సమాచారం.
అనుకున్న పదవి భర్తీ - సామాజిక సమీకరణాల ప్రాధాన్యత ఈసారి మొత్తం ఆరుగురికి అవకాశం ఉండగా, ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేసి, మిగిలిన రెండు ఖాళీలను మరో దఫా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే కోర్ కమిటీ సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో, తాజా భేటీలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
అనుకున్న పదవి భర్తీ - సామాజిక సమీకరణాల ప్రాధాన్యత
ఈసారి మొత్తం ఆరుగురికి అవకాశం ఉండగా, ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేసి, మిగిలిన రెండు ఖాళీలను మరో దఫా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే కోర్ కమిటీ సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో, తాజా భేటీలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఎంపికకు ప్రధాన అంశాలు
ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన నేతలకు ఇచ్చిన హామీలు,సామాజిక సమీకరణాలు,జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డిలకు అవకాశం కల్పించే విషయమై చర్చ జరిగింది.
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం.
ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించే దిశగా మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఐలయ్య, ఆదిశ్రీనివాస్, బాలూ నాయక్, మురళీ నాయక్, రాంచంద్రునాయక్, ప్రేమ్ సాగర్ రావు తదితరుల పేర్లు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
పీసీసీ కూర్పుపైనా చర్చ
పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీ అంశాలపై కూడా చర్చించారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలతో దిల్లీలో సమావేశమై, మంత్రివర్గ విస్తరణపై లోతుగా చర్చించామని తెలిపారు.
తుదినిర్ణయం ఏఐసీసీదే
విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా, మంత్రివర్గ విస్తరణపై అన్ని వివరాలను ఏఐసీసీ పరిశీలించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఉగాది ముందు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, తుది నిర్ణయం ఏఐసీసీదేనని తెలిపారు.
త్వరలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.