
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో స్పై కెమెరా కలకలం.. గుజరాత్ భక్తుడిపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మనాభస్వామి దేవాలయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలానికి దారితీసింది. అత్యున్నత భద్రత కలిగిన ఈ ఆలయంలోకి ఓ భక్తుడు స్మార్ట్ గ్లాసెస్ రూపంలో రహస్య కెమెరాను తీసుకెళ్లిన ఘటన ఆలయ సిబ్బందిని,భద్రతా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆ యాత్రికుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా అనే 66ఏళ్ల వ్యక్తి, ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనార్థం ఆలయానికి వచ్చారు. దర్శనం సమయంలో ఆయన ధరించిన కళ్లజోడు నుంచి వెలువడుతున్న కాంతిని గమనించిన భద్రతా సిబ్బంది,అనుమానంతో ఆయనను అడ్డగించారు. అనంతరం ఆయన వాడుతున్న కళ్లజోడును పరిశీలించగా,అందులో ఒక రహస్య కెమెరా అమర్చినట్లు గుర్తించారు.
వివరాలు
సురేంద్ర షాపై కేసు నమోదు
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి కెమెరాలు తీసుకెళ్లడం,వీడియో తీసుకోవడం చట్టపరంగా నిషిద్ధం. ఈ నేపథ్యంలో సురేంద్ర షాపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించిన నేరానికి సంబంధించి భారతీయ న్యాయ స్మృతిలోని BNSS-223 సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, విచారణ పూర్తయ్యే వరకూ సురేంద్ర షా కుటుంబ సభ్యులు గుజరాత్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.