Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్న విషయం విదితమే.
ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. భారతీయుల చేతికి సంకెళ్లు వేసి, నేరస్థులుగా చూపిస్తూ పంపించడం ఎంతో అవమానకరమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు తాను చూడలేకపోతున్నానని ఆయన అన్నారు.
వివరాలు
దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడేకి అవమానం
2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడే అమెరికాలో ఎదుర్కొన్న అవమానాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
న్యూయార్క్‌లో తన అధికారిక విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఓ వీసా వ్యవహారంలో అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేసి, అవమానించారని గుర్తు చేశారు.
ఆ ఘటనకు నిరసనగా, అప్పటి యూపీఏ ప్రభుత్వ నేతలు భారత పర్యటనలో ఉన్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలవడానికి నిరాకరించారని చెప్పారు.
అంతేకాకుండా, అమెరికా ఎంబసీకి అప్పటివరకు ఇచ్చిన అనేక ప్రోత్సాహకాలను భారత్ వెనక్కు తీసుకున్నట్లు తెలిపారు.
వివరాలు
అమెరికాలో 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు
అమెరికా నుంచి అక్రమ భారతీయ వలసదారులను తీసుకువస్తున్న ఈ విమానం మొదటిది కాదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలోనూ 1100 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిందని, అయితే వారి వివరాలను వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు.
2022 నాటికి అమెరికాలో 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయని వివరించారు.
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచూ కఠిన వైఖరి పాటిస్తున్నారు.
అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను స్వదేశాలకు పంపే విధానాన్ని ఆయన కొనసాగిస్తున్నారని తెలియజేశారు.