
హర్యానాలో 50 గ్రామాలు కఠిన నిర్ణయం..ఆ వర్గం వ్యాపారులకు ప్రవేశం లేదంటూ తీర్మానం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని 50 గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. తమ గ్రామాల్లోకి ముస్లిం వ్యాపారులకు ప్రవేశం లేదని కీలక తీర్మానం చేశాయి.
ఇప్పటికే నివసిస్తున్న ముస్లింలు మాత్రం వెంటనే తమ వివరాలను పోలీసులకు అందించాలని నిర్ణయించాయి.
ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయితీల తరఫున లేఖలు విడుదల అయ్యాయి.
హర్యానాలోని నుహ్ పట్టణంలో చెలరేగిన మత ఘర్షణలతో రేవారీ, మహేంద్రగఢ్, ఝజ్జర్ జిల్లాల్లోని పంచాయితీలు కఠినంగా నిర్ణయం తీసుకున్నాయి.
ఈ మేరకు 50 గ్రామ పంచాయతీలు ముస్లిం వ్యాపారుల ప్రవేశానికి నిరాకరించాయి.
ఆయా లేఖలపై 3 జిల్లాల పరిధిలోని దాదాపు 50 పంచాయతీల సర్పంచ్ లు సంతకాలు చేయడం గమనార్హం.
details
ఆయా 50 పంచాయతీలకు నోటీసులు అందిస్తాం : ఆర్డీఓ మనోజ్ కుమార్
మతపరమైన మనోభావాలను ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని ఆయా లేఖల్లో పంచాయితీలు వివరించాయి. అయితే ఈ 50 పల్లెల్లో ముస్లిం కుటుంబాలు లేవని పేర్కొన్నాయి.
నుహ్ పట్టణంలో ఊరేగింపు సందర్భంగా జరిగిన దాడుల నేపథ్యంలోనే తమ ఊర్లల్లో ముస్లింలు వ్యాపారాలు చేయకూడదని నిర్ణయించినట్లు పంచాయితీలు అంటున్నాయి.
ఈ మేరకు తీర్మానం కాపీలను నార్నౌల్ (మహేంద్రగఢ్) ఆర్డీఓ మనోజ్ కు పంపినట్లు లేఖలు వైరల్ అయ్యాయి. మత మనోభావాలను కించపరచకూడదని, మత సామరస్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి.
మరోవైపు ఈ లేఖలు తమకు అందలేదని, సామాజికమధ్యమాల్లో వాటిని చూశామని ఆర్డీఓ మనోజ్ కుమార్ అన్నారు. అలాంటి లేఖలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఈ మేరకు ఆయా పంచాయతీలకు షోకాజ్ నోటీసులు పంపిస్తామన్నారు.