
#NewsBytesExplainer: బీసీ రిజర్వేషన్ అంశం కవిత, బిఆర్ఎస్ మధ్య దూరాన్ని పెంచిందా?
ఈ వార్తాకథనం ఏంటి
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వ కేబినెట్‌లో నిర్ణయించినట్టుగా వార్తలు వెల్లడి కావడంతో, జాగృతి సంస్థ అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జాగృతి పోరాటం ఫలితంగా ఈ నిర్ణయం వచ్చిందని, ఇది తమ ఉద్యమానికి న్యాయమైన ఫలితమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు తోడు, కవిత సోషల్ మీడియా వేదికగా కూడా కాంగ్రెస్ తీసుకున్న చర్యను సమర్థించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కవిత చేసిన ట్వీట్
I welcome the State Cabinet’s decision to hold local body elections only after providing for 42% reservation for backward classes by amending the existing Act.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2025
Necessary steps in this regard should be initiated immediately.The state government’s decision is a clear victory for…
వివరాలు
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆశ్చర్యం..
కవిత ఈ విధంగా స్పందించడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆశ్చర్యం కలిగించింది. బీఆర్‌ఎస్ పార్టీకి తాను చెందినవారినే అని, పార్టీలో తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నే అని కవిత పునరుద్ఘాటిస్తూ వస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ పార్టీలో తన పాత్ర, కృషి ఎంతో ఉందని, తాను పార్టీ వారసురాలినే అని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఒకవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించడం రాజకీయంగా వివాదాస్పదమైంది. దీంతో పార్టీకి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చునన్న భావనతో బీఆర్‌ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు.
వివరాలు
ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం
ఆర్డినెన్స్ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమా? అన్న ప్రశ్నను బీఆర్‌ఎస్ నేతలు వేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి, నోటిఫికేషన్‌లు విడుదల చేస్తే, అది న్యాయపరమైన సంక్లిష్టతలకు దారితీస్తుందని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు మరింత వాయిదాపడే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ, పూర్తి స్థాయిలో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి, అప్పుడు మాత్రమే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు కవిత స్వాగతించడం.. మరో వైపు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించడం.. ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితిని మరోసారి బయట పెట్టినట్లయింది.
వివరాలు
తన రాజకీయాలు తాను చేసుకుంటూ వెళుతున్న కవిత
కవిత సంబరాలు, ఆమె పద్ధతి పార్టీకి నష్టాన్ని కలిగించిందన్న అభిప్రాయం బీఆర్‌ఎస్ కీలక నేతల్లో కూడా వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, ప్రస్తుతం ఆమెపై ఏవైనా బహిరంగ చర్యలు తీసుకునే పరిస్థితిలో పార్టీ కనిపించడం లేదు. మరోవైపు, కవిత మాత్రం తన రాజకీయాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు.