పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్పై విచారణ.. ప్రతివాదులకు నోటీసులు
2019 ఎన్నికల్లో కర్నాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలని చెప్పడంతో అప్పట్లో ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది. అలాగే రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీకి సైతం సుప్రీం నోటీసులు ఇచ్చింది.
తదుపరి విచారణ ఆగస్టు 4కు వాయిదా
బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు 'మోదీ ఇంటిపేరు' కేసులో ఆయన్ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం జిల్లా కోర్టుతో పాటు హైకోర్టులోనూ రాహుల్కు చుక్కెదురైంది. సూరత్ కోర్టు తీర్పును కొట్టి వేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన అభ్యర్థనపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్లు జైలుశిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే రాహుల్ గాంధీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిణామాలతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైంది.