Page Loader
Srisailam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణా,తుంగభద్ర నదులు.. శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల 
శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల

Srisailam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణా,తుంగభద్ర నదులు.. శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం కృష్ణా,తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారిపోయింది.మూడు గేట్లు ఎత్తడంతో భారీగా నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. గురువారం నాడు జూరాల ప్రాజెక్టుకు 1.10లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో అక్కడ 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొత్తం అవుట్‌ఫ్లో 1,13,681క్యూసెక్కులుగా నమోదుైంది. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడ 11క్రస్ట్‌ గేట్లను 2.5అడుగుల మేర ఎత్తి, 31,130క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో చేరుతోంది. మూడు క్రస్ట్‌ గేట్లను 10అడుగుల మేర ఎత్తడంతో 81,195క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌ వైపు విడుదల చేస్తున్నారు.

వివరాలు 

ప్రస్తుతం నీటిమట్టం 882.80 అడుగులకు..

గురువారం సాయంత్రం వరకు శ్రీశైలానికి ఎగువ నుంచి 1,75,233 క్యూసెక్కుల వరద నీరు వచ్చిందిగా నమోదు అయింది. ఈ జలాశయ పరిమితి 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 882.80 అడుగులకు చేరింది. పూర్తి సామర్థ్యం 215.8070 టీఎంసీలైతే, ప్రస్తుతం నీటి నిల్వ 203.4290 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ జలాశయంలో మాత్రం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 540.60 అడుగులకు మాత్రమే నీరు చేరింది.

వివరాలు 

లక్ష్మీ బరాజ్‌ (మేడిగడ్డ) వద్ద భారీ వరద ఉధృతి 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద వరద ప్రవాహం తీవ్రంగా పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఇక్కడి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. గురువారం నాడు 6,36,130 క్యూసెక్కుల నీరు వచ్చిందిగా అధికారులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా మొత్తం 85 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్‌లను తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతోంది.

వివరాలు 

సమ్మక్క బరాజ్‌ వద్ద గోదావరిలో భారీ ప్రవాహం 

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమీపంలో ఉన్న సమ్మక్క బరాజ్ వద్ద కూడా గోదావరి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీనివల్ల గురువారం నాడు 59 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి బరాజ్‌లోకి 5,80,430 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఈ ఏడాది గోదావరిలో వరద పెరగడం వలన భారీ వృక్షాలు, కర్రలు బరాజ్‌ గేట్లవైపు కొట్టుకొస్తున్నాయి. ఇవి గేట్లకు బలంగా ఢీకొడుతున్న నేపథ్యంలో, కొన్ని సందర్భాల్లో గేట్లను సమయానికి ఎత్తకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది.