Andhra Pradesh: ఏపీకి భారీ వర్షం.. పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. చెన్నై నుండి 800 కిలోమీటర్లు, ట్రింకోమలికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రేపటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. రెండ్రోజుల్లో ఇది శ్రీలంక తీరాన్ని తాకి, తమిళనాడు వైపునకు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలను కురిపించే అవకాశం ఉంది.
నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం
రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడి, ఈనెల 30 నాటికి ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరం మీద గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అన్ని పోర్టుల్లో కూడా 1 నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.