
Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారింది. వాతావరణ శాఖ అంచన ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశముందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తీరం వెంట గంటకు 40 నుండి 60కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు ప్రస్తుతం సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారుల సూచనలు జారీ చేశారు.
విజయవాడ
విజయవాడలో వర్షం కారణంగా ఇబ్బందులు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. విజయవాడ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఫలితంగా పలు రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్యాంకర్ల సహాయంతో చర్యలు చేపట్టుతున్నారు.