Chennai: చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వర్షం.. పాఠశాలలు మూసివేత..హెల్ప్‌లైన్ నంబర్‌లు
చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. చెన్నై, చెంగల్‌పట్టు, రాణిపేట, కాంచీపురం జిల్లాల్లోని పాఠశాలలకు, తిరువళ్లూరులోని రెండు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులోని పలు వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా సహాయం అవసరమైన వారి కోసం చెన్నై కార్పొరేషన్ నగరంలో హెల్ప్‌లైన్ నంబర్‌లను ప్రారంభించింది.
డిసెంబర్ 2న తుఫానుగా మారుతుందని అంచనా
డిసెంబర్ 2, 3 తేదీల్లో తమిళనాడు రాజధాని,దాని పొరుగు జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని,ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నేడు బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని IMD తన తాజా బులెటిన్‌లో తెలిపింది. ఆ తర్వాత, ఇది డిసెంబర్ 2న తుఫానుగా మారుతుందని అంచనా వేసింది.
డిసెంబర్ 4 వరకు ఉరుములతో కూడిన వర్షం
తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా చెన్నై, చెంగల్‌పేట, విల్లుపురం జిల్లాల్లో ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. తమిళనాడులో భారీ వర్షం మధ్య, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులను వర్షాభావ ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని సహాయాలను అందించాలని ఆదేశించారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలు,ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి,కారైకల్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో వచ్చే ఐదు రోజులలో డిసెంబర్ 4 వరకు ఉరుములతో కూడిన వర్షం కూడా కురుస్తుందని IMD అంచనా వేసింది.