Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు
కొమరం భీమ్, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రిజర్వాయర్ల గేట్లు ఎత్తినపుడు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం వంటి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.