Page Loader
ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

ముంబై మహానగరానికి అతి భారీ వర్ష సూచన.. బయటకు రాకూడదని బీఎంసీ హెచ్చరిక

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 27, 2023
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఇవాళ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ముంబై వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ ను సూచించింది. గడిచిన 24 గంటల్లో మహానగరంతో పాటు శివారు ప్రాంతంలోనూ అతి భారీ వర్షాలు కురిసినట్లు బృహన్ బాంబే మున్సిపల్ కార్పోరేషన్ (BMC) అధికారులు వెల్లడించారు. మరోవైపు గురువారం ఉదయం నుంచి వర్షాలు నగర వ్యాప్తంగా దంచికొడుతున్నట్లు పేర్కొన్నారు. భయంకరమైన వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించింది.

DETAILS

గడిచిన 24 గంటల్లో ముంబైలో 223.2 మి.మీతో అత్యంత వర్షపాతం నమోదు 

నగర వాసులంతా అప్రమత్తంగా మెలగాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఐఎండీ సూచించింది. గడిచిన 24 గంటల్లో ముంబైలో దాదాపుగా 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ మేరకు ఇది అత్యంత భారీ వర్షాపాతమని స్పష్టం చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో 153.5 మి.మీ, రామ్ మందిర్ ప్రాంతంలో 161 మి.మీ, బైకుల్లాలో 119 మి.మీ, సియోన్ లో 112 మి.మీ, బాంద్రాలో 106 మి.మీ వర్షం కురిసినట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.