Page Loader
MK Stalin: హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్ 
హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్

MK Stalin: హిందీ వల్లే ఉత్తర భారతంలో 25 భాషలు నాశనం: స్టాలిన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రంలో అధికార బీజేపీ, తమిళనాడు అధికార డీఎంకే మధ్య హిందీ భాషను చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ-సంస్కృతం ప్రభావంతో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎం.కె. స్టాలిన్ చేసిన ట్వీట్ 

వివరాలు 

అనేక భాషలు ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతున్నాయి

"ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా... హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు అంతరించిపోయాయో ఎప్పుడైనా ఆలోచించారా? గత 100 ఏళ్లలో ఉత్తర భారతదేశంలో 25 భాషలు మాయమయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా వంటి అనేక భాషలు ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు క్రమంగా మాయమయ్యాయి. తమిళనాడు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొకూడదనే మేము ప్రతిఘటిస్తున్నాం. భాషలపై దాడి చేయడం ద్వారా జాతి, సంస్కృతిని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు," అని స్టాలిన్ పేర్కొన్నారు.

వివరాలు 

భాజపా -డీఎంకేల  వివాదం చిన్నపిల్లల గొడవలా మారింది 

జాతీయ విద్యావిధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని కేంద్రం ప్రతిపాదించింది, అందులో విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించింది. అయితే, డీఎంకే ప్రభుత్వం మాత్రం ద్విభాషా విధానానికి కట్టుబడి ఉందని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని సహించబోమని స్పష్టం చేసింది. తమిళ భాష, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను హాని కలిగించే విధానాలను అనుమతించబోమని స్టాలిన్ పేర్కొన్నారు. ఇక ఈ వివాదంపై కొన్నిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతుండగా, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ స్పందించారు. భాజపా - డీఎంకేల మధ్య జరిగే ఈ వివాదం చిన్నపిల్లల గొడవలా మారిందని వ్యాఖ్యానించారు.