మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు
సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా విస్త్రృతంగా వానలు కురిపించి భారత్ లోని అనేక ప్రధాన ప్రాజెక్టుల్లో, జలశయాల్లో నీటిని నింపే నైరుతి రుతుపవనాలు ఇప్పటకీ తెలుగు రాష్ట్రాలకు దూరంగానే ఉండటం కలవరపెడుతున్న అంశం. సౌత్ వెస్ట్ మన్ సూన్ సీజన్ ఆరంభమైనప్పటికీ దాని ఫలాలు మాత్రం ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తోంది.
దేశవ్యాప్తంగా మరిన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఉంటాయి : ఐఎండీ
ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు అంటే జూన్ 17 వరకు ఈ ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు ఠారెత్తిస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని గంగానది పరిసర ప్రాంతాలు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వచ్చే ఐదు రోజులు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించింది. అయితే మధ్యప్రదేశ్‌లో మరో రెండు రోజులు అధిక వేడి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ చెప్పింది.