Aurangzeb row: ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ డిమాండ్.. నాగ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్లు నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలకు దారి తీసాయి.
ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందిస్తూ, ప్రజలను శాంతిని పరిరక్షించేందుకు పిలుపునిచ్చారు.
''మహల్ ప్రాంతంలో రాళ్లు రువ్విన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు'' అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నాగ్‌పూర్ ఎల్లప్పుడూ శాంతియుత నగరమని, స్థానికులు పరస్పర సహాయ సహకారాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే, ప్రజలు వదంతులను నమ్మకూడదని సూచించారు.
వివరాలు
దెబ్బతిన్న అగ్నిమాపక శాఖ వాహనాలు
ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ మహల్ ప్రాంతంలో నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నిరసనల సమయంలో కొందరు రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది.
ఈ దాడిలో అగ్నిమాపక సిబ్బంది గాయపడగా, అగ్నిమాపక శాఖ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
పోలీసుల చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, ఘటనలో నలుగురు గాయపడినట్లు సమాచారం.
''కొంత మంది రాళ్లు రువ్వారు.దాంతో మేము తగిన చర్యలు తీసుకుని భాష్ఫవాయువును ప్రయోగించాం. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.నా కాలికీ రాయి తగిలి గాయం అయ్యింది. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అని నాగ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
వివరాలు
నితిన్ గడ్కరీ స్పందన
నాగ్‌పూర్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ఘటనపై స్పందించారు.
ప్రజలు హింసకు పాల్పడకూడదని కోరుతూ ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
''చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. అందుకే, వదంతులను నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అని అన్నారు.
వివరాలు
సమాధి తొలగింపుపై రాజకీయ ప్రక్రియ
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో సానుకూలంగా స్పందించారు.
అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా చట్టబద్ధంగా ఉండాలంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఖులాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
హింసకు కారణమైన ఈ సమాధికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ''ఈ సమస్యను రాజకీయం చేయడానికి, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.