Page Loader
Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?
ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటనతో పాకాల భవిష్యత్ ఎలా మారనుంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు, విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ పాకాల ప్రత్యేకతలు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు ఇప్పటికీ వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతులకు ప్రాణాధారంగా మారింది. అయితే కొందరి స్వార్థంతో ఈ ప్రాంత ప్రత్యేకత కనుమరుగవుతోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Details

 ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటన 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాకాల సరస్సు పరిసరాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న పాకాల అడవులను పరిరక్షించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.

Details

పర్యవేక్షణ కమిటీలో ఎవరుంటారంటే? 

ఈ కమిటీలో తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, పర్యావరణ శాఖ కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, యూనివర్సిటీ జీవావరణ శాస్త్ర అధ్యాపకులు, జిల్లా కలెక్టర్, జీవ వైవిధ్య బోర్డు సభ్యులు, అటవీశాఖ డీఎఫ్ఓ, పర్యావరణ శాఖ డైరెక్టర్‌లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Details

 సెన్సిటివ్ జోన్‌లో చేపట్టే చర్యలు 

అధికారుల పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తారు. క్వారీయింగ్‌లను పూర్తిగా నిలిపివేస్తారు. ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తారు. అడవులను అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం సర్క్యూట్‌ను రూపొందిస్తారు. కొత్త పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణాలకు అనుమతి ఉండదు. కొండలు, గుట్టల వద్ద రాళ్ల తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తారు. పర్యాటక అభివృద్ధి పర్యాటకులను ఆకర్షించేందుకు రూ. 56 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా: బట్టర్‌ఫ్లై గార్డెన్, బోటింగ్‌, నైట్ క్యాంపింగ్‌, ట్రెక్కింగ్‌, వన్యప్రాణుల వీక్షణ కోసం సఫారీ ఏర్పాటు చేయనున్నారు.

Details

 పాకాల సరస్సు ఎక్కడుంది? 

పాకాల సరస్సు హైదరాబాద్‌ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉండగా, పాకాల సమీప పట్టణం నర్సంపేట. ఇది ఖానాపురం మండల పరిధిలో ఉంది. నర్సంపేట నుంచి పాకాల 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తగూడ వెళ్లే మార్గంలో ఈ అద్భుతమైన పాకాల అడవి విస్తరించి ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి హైదరాబాద్‌ నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ తాజా నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడనుంది. అక్రమ తవ్వకాలను అరికట్టడం, అడవిని రక్షించడం, పర్యాటక అభివృద్ధి ద్వారా పాకాల తన ప్రత్యేకతను సజీవంగా ఉంచుకోనుంది.