Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
ఈ వార్తాకథనం ఏంటి
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, కృత్రిమ మేధ (ఏఐ) నిపుణులు, పరిశ్రమల మార్గదర్శకులు, విధాన నిర్ణయకర్తలు, అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరుకానున్నారు. 50 దేశాలకు చెందిన సుమారు 3,000మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. "టెక్ బయో అన్‌లీష్డ్:ఏఐ ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్" అనే ప్రధాన థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. బయో ఉత్పత్తుల రంగంలో నూతన ఆవిష్కరణలు,ఆధునిక సాంకేతిక విధానాలు,ఏఐ ఆధారిత పరిశోధన-అభివృద్ధి,తదితర అంశాలకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించే వేదికగా ఇది ఉపయోగపడనుంది. 'టెక్-బయో' భవిష్యత్ కార్యాచరణపై అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక చర్చాసభలు నిర్వహించనున్నారు.
వివరాలు
హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సును ప్రారంభించనున్న రేవంత్
జీవశాస్త్రం ప్రయోగాల స్థాయి నుంచి అమలు దశకు వేగంగా మారుతున్న ఈ సమయంలో, ఈ నెల 17, 18 తేదీల్లో హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభోపన్యాసంతో సెషన్లు మొదలవుతాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్ నేతృత్వంలో సదస్సు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వివరాలు
తెలంగాణ రైజింగ్‌పై ప్రత్యేక సెషన్
'తెలంగాణ రైజింగ్ విజన్-2047'పై ప్రత్యేక సెషన్‌ను సదస్సులో నిర్వహించనున్నారు. ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అంతర్జాతీయ ప్రతినిధుల ముందుంచనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) వేగంగా విస్తరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా సెల్ థెరపీ పరిశోధన, తయారీకి పునాది వేసిన ఆవిష్కరణలకు పేరుగాంచిన జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్ సంస్థ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ మిల్టెనీ ఈ సదస్సులో పాల్గొంటారు. ఆవిష్కరణ దశ నుంచి క్లినికల్ ప్రూఫ్ వరకు తదుపరి తరం బయాలాజిక్స్ పరిణామాలపై ఆయన ప్రసంగించనున్నారు.
వివరాలు
సదస్సులో చర్చించనున్న ఇతర ముఖ్య అంశాలు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్య వాతావరణ ప్రభావాలు కొత్త వ్యాధుల ఆవిర్భావం, అవి వేగంగా వ్యాపిస్తున్న పరిస్థితులు సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల తీవ్రత, వాటికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమవుతున్న కొత్త ఔషధాలు, జీవశాస్త్ర ఆవిష్కరణలు సైన్స్, సాఫ్ట్‌వేర్, ఏఐ వంటి నూతన సాంకేతికతలు ఔషధాలు, వైద్య పరికరాల తయారీలో పోషిస్తున్న కీలక పాత్ర పేద, మధ్యతరగతి దేశాల ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాలు ఫార్మా, బయోటెక్ రంగాల అభివృద్ధికి అవసరమైన వృద్ధి చోదకాలు