HYDRA: చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేయాల్సి ఉంటుంది: హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
జలవనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు వ్యతిరేకం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏ నిర్ణయమైనా చట్టబద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రే నగరాన్ని మార్పు చేయలేరని పేర్కొంది.
సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు జరిపి ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జీవో 99ను పాటించాల్సిన అవసరం ఉందని, అదనంగా వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Details
హైడ్రా తీరుపై అసంతృప్తి
హైడ్రా తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జీవో 99కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఆదేశాలివ్వాల్సి వస్తుందని పేర్కొంది.
హైడ్రాను అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా కూల్చివేతలు చేపట్టడం తగదని స్పష్టం చేసింది.
కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నోటీసులు జారీ చేసి, సమయమిచ్చి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Details
పిటిషన్ వివరాలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన ఎ. ప్రవీణ్ తన స్థలానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు.
తన స్థలంపై సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేశారని ఆరోపించారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ గురువారం విచారణ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేత చేపట్టిందని తెలిపారు.
Details
అన్ని పత్రాలు పరిశీలించాకే చర్యలు చేపట్టాం
2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు పొందారని, అందుకే తర్వాత ఆ అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
Details
హైకోర్టు ప్రశ్నలు
2023లో మంజూరైన అనుమతులను 2025లో ఎలా రద్దు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు పొందారని ఎలా చెబుతున్నారని నిలదీసింది.
గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు, అయితే హైడ్రా రాకముందు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.
పార్కు స్థలం ఆక్రమణ జరుగుతోంటే ముందు ఎందుకు స్పందించలేదని అడిగింది.
హైడ్రా అధికారులను ఉద్దేశించి, "మీరు హక్కులను నిర్ణయించడానికి ఎవరు?" అంటూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
తుది ఆదేశాలు
పిటిషనర్‌కు చెందిన స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ, విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.