Page Loader
Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్
నేను ఉగ్రవాది కాదు.. రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్

Yasin Malik:"నేను ఉగ్రవాది కాదు..  రాజకీయ నాయకుడిని": సుప్రీంకోర్టుకు యాసిన్ మాలిక్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను రాజకీయ నాయకుడని, ఉగ్రవాదిని కాదని వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ (Yasin Malik)స్పష్టం చేశాడు. గతంలో తనతో ఏడుగురు భారతప్రధానులు చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలపై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాలిక్, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సీబీఐ చేసిన ఉగ్రవాద ఆరోపణలను అతను ఖండించాడు. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదని పేర్కొన్నాడు. 1994లో తనపై నమోదైన 32 కేసుల్లో బెయిల్‌ లభించిందని,ఆ కేసులను కొనసాగించలేదని గుర్తుచేశాడు. పీవీ నరసింహారావు,హెచ్‌డీ దేవెగౌడ,ఐకే గుజ్రాల్,అటల్ బిహారీ వాజ్‌పేయి,మన్మోహన్ సింగ్ హయాంలో తన సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు.

వివరాలు 

కేసులను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు..

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించారని, అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసులను తిరిగి విచారణకు తెచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశాడు. 1989లో జమ్మూలో అతనిపై నమోదైన రెండు కేసుల్లో విచారణ నిమిత్తం మాలిక్‌ను కోర్టులో హాజరుపరచాలని చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసులను జమ్మూ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున అతడు అక్కడికి వెళితే తీవ్రవాద దాడులు జరగవచ్చని సీబీఐ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.

వివరాలు 

వాయుసేన సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు

ఈ నేపథ్యంలో మాలిక్ మాట్లాడుతూ, తానేమీ ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశాడు. 1990 జనవరి 25న పాత శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వాయుసేన సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు మాలిక్‌ నేతృత్వం వహించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అరెస్టయిన అతడిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 1994లో జైలు నుంచి విడుదలైన మాలిక్‌ తరువాత ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు రుజువు కావడంతో జీవితఖైదు విధించబడింది. ప్రస్తుతం తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.