
Telangana: గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ నిర్మాణం.. ఓఆర్‌ఆర్‌పై 'గేట్ వే ఆఫ్ హైదరాబాద్'.. 2నెలల్లో టెండర్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో నగరానికి మరో ఆర్థిక చక్రాన్ని అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రారంభించనుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేలా "గేట్‌వే ఆఫ్ హైదరాబాద్" పేరిట ప్రత్యేక ముఖద్వారం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రథమ దశలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ (గాంధీ సరోవర్) వరకు సుమారు 9 కి.మీ. ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగు రోడ్డుకు వెళ్లే మార్గంలో ఈ గేట్‌వే ఏర్పడుతుంది. కిస్మత్‌పుర నుంచి బాపూఘాట్ వరకు మూసీ నది ఒడ్డు సుందరీకరణతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
వివరాలు
ఎకోథీమ్ పార్క్ - ఐకానిక్ టవర్‌తో పర్యాటక హబ్
మార్గమధ్యంలో కన్వెన్షన్ సెంటర్లు వంటి ప్రాజెక్టులు నిర్మించనున్నారు. ఇదే సమయంలో, గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్‌ను నిర్మించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు త్వరగా పూర్తి చేసి, రెండు నెలల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎంవో శనివారం తెలిపిన ప్రకారం, ఈ ప్రాజెక్టు బహుముఖ ప్రయోజనాలతో ముందుకు సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షణీయంగా స్వాగతం పలికేలా "గేట్‌వే ఆఫ్ హైదరాబాద్"ను రూపొందించనున్నారు. తెలంగాణ ఆర్థిక శక్తిని పెంచే విధంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో పలు అంశాలు చేరుస్తున్నారు.
వివరాలు
కొత్త పైవంతెనతో మెరుగైన కనెక్టివిటీ
ఔటర్ రింగు రోడ్డుకు ఒక వైపు ఎకోథీమ్ పార్క్, మరోవైపు బాపూఘాట్ సమీపంలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణం ప్రణాళికలో ఉంది. వీటి డిజైన్లను రూపొందించే పనులు జరుగుతున్నాయి. గాంధీ సరోవర్ వద్ద ఎకోథీమ్ పార్క్, ఐకానిక్ టవర్‌లకు సులభంగా చేరుకునేలా ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే సూచించారు. అలాగే, బాపూఘాట్ పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఆకర్షణీయ జోన్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక సిద్ధమవుతోంది. హిమాయత్‌సాగర్ సమీప అప్రోచ్ రోడ్డు నుంచి అత్తాపూర్ దిశగా ప్రయాణం సులభం కావడానికి కొత్త పైవంతెన నిర్మించనున్నారు. ఈ పైవంతెన గాంధీ సరోవర్ పరిసరాలకు ప్రత్యక్ష కనెక్టివిటీ అందిస్తుంది.
వివరాలు
భూగర్భ తాగునీటి నిల్వలు - వరదనీటి నిర్వహణ
విమానాశ్రయం నుంచి నేరుగా అక్కడికి చేరుకునే ప్రత్యేక రహదారి అవకాశాన్నికూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ సరోవర్ వద్ద ఐకానిక్ టవర్ ఎత్తు, డిజైన్ స్థానిక భూభాగం పరిస్థితులు, లభ్యమైన స్థలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు డిజైన్లలో తాగునీటి నిల్వ మరియు వరదనీటి నియంత్రణ అంశాలు కూడా చేర్చుతున్నారు. అంతర్జాతీయ స్థాయి నదీతీర అభివృద్ధి నమూనాలను పరిశీలించి, వాటి నుండి స్ఫూర్తి పొందుతున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళిక ఉంది.
వివరాలు
రాత్రివేళా వ్యాపార కార్యకలాపాలు: సీఎం
నది పరీవాహక ప్రాంతం ఇరువైపులా భూగర్భంలో అధిక సామర్థ్యం గల తాగునీటి నిల్వ సంపులను ఏర్పాటు చేసి, అవసరాల ప్రకారం నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, గాంధీ సరోవర్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటి ప్రవాహంపై సాంకేతిక అధ్యయనాలు చేస్తున్నారు. "హైదరాబాద్‌లో ఉదయం నుంచి రాత్రివరకు ఆర్థిక చైతన్యం ఉంటుంది. రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కూడా ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు మూసీ పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టు ఉపయుక్తం కానుంది.ఇది కేవలం సుందరీకరణ కాదు.. తెలంగాణకు మరో ఆర్థిక చక్రాన్ని అందించే ప్రాజెక్టు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్లు,ఐటీ సంస్థలు,హోటళ్లు, పరిశ్రమలు, పర్యాటక కేంద్రాలు, డౌన్‌టౌన్ ప్రాంతాలు ఉంటాయి.
వివరాలు
హైదరాబాద్‌లో పాతబస్తీనే అసలైన నగరం
భారతదేశంలో పాత నగరాలను వదిలి కొత్త నగరాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ధోరణి ఉంది. కానీ హైదరాబాద్‌లో పాతబస్తీనే అసలైన నగరం. దానికి నేను పునరుజ్జీవం ఇస్తాను. రాబోయే 50 ఏళ్ల దృష్ట్యా, మూసీ ఇరువైపులా బలమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం" అని సీఎం స్పష్టం చేశారు.