Page Loader
Fake marriage promises: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్
20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

Fake marriage promises: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి మహిళలకు పెళ్లి హామీ ఇచ్చి సైట్ల సాయంతో మోసం చేసేవాడు. నిందితుడు తనను తాను ఐఐఎం గ్రాడ్యుయేట్‌గా చెప్పుకుంటున్నాడు. తాను ఓ పెద్ద కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేశానని మహిళలకు చెప్పేవాడు. చాలా మంది మహిళలు అతని వలలో పడి భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు సమాచారం.

వివరాలు 

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ప్రీమియం ఖాతాల సృష్టి

ఈ మోసం కేసు గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ ప్రాంతానికి చెందినది. ఆజ్ తక్‌తో సంబంధం ఉన్న భూపేంద్ర చౌదరి నివేదిక ప్రకారం, బిస్రఖ్ పోలీసులు అరెస్టు చేసిన దుండగుడిని రాహుల్ చతుర్వేదిగా గుర్తించారు. రాహుల్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలను ఆకర్షించేవాడు. ప్రొఫైల్ నిజమైనదిగా కనిపించేలా అతను ప్రీమియం ఖాతాను సృష్టించేవాడు. మహిళలతో పరిచయమైన తర్వాత వారిని కలుసుకుని నకిలీ జీతం స్లిప్పులు, నకిలీ పత్రాలు చూపించేవాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళలను మోసం చేసేవాడు. ప్రధానంగా ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలే ఇతగాడి లక్ష్యమని పోలీసులు తెలిపారు. రాహుల్ చతుర్వేది తనను తాను ఐఐఎం గ్రాడ్యుయేట్‌గా, ఓ పెద్ద కంపెనీకి ప్రాంతీయ మేనేజర్‌గా అభివర్ణించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

20 మందికి పైగా మహిళలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇప్పటి వరకు 20మందికి పైగా మహిళలను అతగాడి వలలో చిక్కుకున్నారు. రాహుల్ మహిళలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కలుస్తూ వారితో మాట్లాడేవాడని సమాచారం. మోసం చేయడానికి,అతను తన గొంతు మార్చేవాడు.మహిళలతో తన తండ్రిలా మాట్లాడేవాడు, తద్వారా మహిళల కుటుంబాల నమ్మకాన్ని కూడా చూరగొన్నాడు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే బిస్రఖ్ పోలీసులు రాహుల్ చతుర్వేదిని అదుపులోకి తీసుకున్నారు. అతని చర్యలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. మరింత మంది బాధిత మహిళల గురించి సమాచారం రాబట్టేందుకు రాహుల్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆన్‌లైన్ మోసం కేసు తమ దృష్టికి వచ్చిన వెంటనే,మ్యాట్రిమోనియల్ సైట్‌లలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.