
Monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన వెంటనే,అవి క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో,ఈ రుతుపవనాలు ఉత్తర బంగాళాఖాతానికి చేరుకుని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలపై ప్రభావం చూపాయి.
ఈ రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అల్పపీడన స్థితి ఏర్పడింది.
ఇది నెమ్మదిగా తూర్పు దిశగా కదిలే అవకాశం ఉండగా, అదే సమయంలో దీని తీవ్రత మరింత తగ్గే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
వివరాలు
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
ఇక తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఒడిశా,మధ్య మహారాష్ట్ర,ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్రమట్టానికి 1.5 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో, దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఏపీకి రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచన…
మే 31 లేదా జూన్ 1న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి అధికారికంగా ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇకఉష్ణోగ్రతల విషయానికొస్తే,ఈ రోజు సాధారణ స్థాయిలోనే ఉండే సూచనలున్నాయి.
నల్లగొండలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముండగా, హైదరాబాద్, మెదక్‌లలో కనిష్ఠంగా 31.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 నుంచి 7డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నైరుతిరుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తరువాత,ఇవాళ రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీనివల్ల పశ్చిమ మధ్య బంగాళాఖాతం,ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముంది.
వివరాలు
సముద్రంలో చేపల వేట.. ప్రత్యేక హెచ్చరికలు
మంగళవారం.. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు.
వర్షాల కారణంగా అపాయం కలగకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.
వర్షాలు పడుతున్న సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.