Page Loader
Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం 
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం

Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన భారత న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనలో నిందితుడిగా నిలిచిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్ర ప్రభుత్వం అభిశంసన చర్యలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉందని సమాచారం. ఈ అభిశంసన తీర్మానం పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు త్వరలో ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతికూల నివేదిక ఇచ్చిన న్యాయమూర్తుల విచారణ కమిటీ  

అంతేకాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన ముగ్గురు న్యాయమూర్తుల విచారణ కమిటీ కూడా జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతికూల నివేదికను సమర్పించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అభిశంసన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన కాలంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ యశ్వంత్ వర్మను రాజీనామా చేయమని మౌఖికంగా కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆయన ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్టు సమాచారం. దీంతో జస్టిస్ ఖన్నా, సీజేఐ హోదాలో రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు లేఖ రాసి, జస్టిస్ వర్మపై అభిశంసన తప్పనిసరి అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

వివరాలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం 

ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో, జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానాన్ని ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టి, అనంతరం రాజ్యసభకు తీసుకెళ్లే అవకాశముంది. అభిశంసన తీర్మానం ఆమోదం పొందేందుకు రెండింటి సభలలో సభ్యుల మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. ఈ ప్రక్రియలో ముందుగా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు, లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు తమ సమ్మతిని తెలపాల్సి ఉంటుంది.