Kapu Reservation: కాపుల రిజర్వేషన్ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ మాజీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.
కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ, గతంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
హరిరామ జోగయ్య తన లేఖలో 2019 టీడీపీ హయాంలో జారీ చేసిన జీవో నెంబర్ 45 ఆధారంగా, ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అందించడంపై ప్రస్తావించారు.
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ రిజర్వేషన్ అమలులో విఫలమైందని ఆరోపించారు.
Details
హైకోర్టును అశ్రయించిన కాపు సంక్షేమ సేన
అంతేకాకుండా కాపులపై కక్షపూరిత వైఖరితో వ్యవహరించిందని విమర్శించారు. కాపు సంక్షేమ సేన ఐదు శాతం రిజర్వేషన్ అమలు కోసం హైకోర్టును ఆశ్రయించింది.
అయితే వైసీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ అమలు చేయకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
ఇప్పుడు జనవరి 28న న్యాయస్థానంలో ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. హరిరామ జోగయ్య తన ఆమరణ నిరాహార దీక్ష సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
రిజర్వేషన్ అంశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పని చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు.
Details
హామీని నిలబెట్టుకోవాలి
చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్‌ను కూటమి ప్రభుత్వం మరోసారి అమలు చేయాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు.
హైకోర్టులో ఈ అంశంపై దాఖలు చేయాల్సిన రివైజ్ కౌంటర్ ద్వారా కాపులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
కాపుల హక్కులను సాధించడంలో కాపు నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తన బాధ్యతలు మరచిపోవద్దని హరిరామ జోగయ్య తన లేఖలో పిలుపునిచ్చారు.