కరీంనగర్‌లో రాహుల్ గాంధీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై కోదండరామ్‌తో చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో వీ పార్క్ హోటల్‌లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్‌ను రాహుల్ గాంధీ కోరినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నాలుగు చోట్ల జన సమితి సీట్లను ఆశిస్తోంది.
నాలుగు సీట్లను కోరుతున్న కోదండరామ్
కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలోని ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను కోదండరామ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అటు సీపీఐ, సీపీఎం కూడా పొత్తు పెట్టుకుంది ఇప్పటికే సీపీఐ, సీపీఎం రెండేసి సీట్లను కేటాయించనుంది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, సీపీఎం భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలను కోరింది. మరోవైపు బీజేపీ, జనసేన కూడా పొత్తులో ముందుకెళ్తాయని తెలుస్తోంది. అయితే జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.