Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు. పత్తి పంట పూత దశలో ఉండటం, వరి నాట్లు పూర్తయిన దశలో ఉండడంతో వరదల ప్రభావం ఈ పంటలపై పడింది. పంట మునిగిన ప్రాంతాలపై వ్యవసాయశాఖ మరింత దృష్టి సాధించలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గ్రామాల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించడానికి ఎవరూ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పంటలు
ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు తెలిసింది. పత్తి 42.66 లక్షల ఎకరాలు, వరి 47.81 లక్షల ఎకరాల్లో సాగు అయింది. మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం వంటి జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక పంటల బీమా అందుబాటులో లేకపోవడం రైతులను మరింత కష్టాల్లో నెట్టింది. ప్రభుత్వం ఈ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకురావాలని హామీ ఇచ్చినా, అది ఇప్పటికీ అమలులోకి రాలేదు. దీనిపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.