Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లు, అమరావతిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఈ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. అయితే సైబర్ నేరాలను పెరుగుతుండటంతో 24 జిల్లాల్లో అదనపు సైబర్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పోలీస్ స్టేషన్లకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇన్‌స్పెక్టర్లను ఎస్‌హెచ్‌వోలుగా నియమించనున్నారు.
సైబర నేరాల్లో అధిక శాతం ఆర్థిక మోసాలే
సైబర్ నేరాల కేసులను విచారించేందుకు, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చనున్నారు. ఫిర్యాదుదారులకు సహకరించడం, నేరాలను వివరంగా విచారణ చేయడం ఈ స్టేషన్ల ముఖ్య బాధ్యతగా ఉండనుంది. సైబర్ నేరాల్లో అధిక శాతం ఆర్థిక మోసాలే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సైబర్ మోసాల ద్వారా నేరగాళ్లు ఏటా దాదాపు రూ.313 కోట్లు దోచేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా నకిలీ కాల్స్ ద్వారా బ్యాంకు వివరాలు తీసుకోవడం, క్రిప్టో కరెన్సీ, నకిలీ యాప్‌లు, మేట్రిమోని మోసాలు కూడా ఉండడం గమనార్హం.
ఉద్యోగాల అవకాశాల పేరుతో అధిక మోసాలు
అంతేకాకుండా, ఫేక్ వెబ్‌సైట్లు, ఉద్యోగ అవకాశాలు పేరుతో జరిగిన మోసాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 10,125 సైబర్ నేరాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 2% మాత్రమే కేసులను చేధించారు. నేరగాళ్లు వేరే దేశాల్లో, ప్రాంతాల్లో ఉంటుండటంతో వారి పట్టుబడటం, మోసపోయిన సొమ్మును తిరిగి రాబట్టడం కష్టతరంగా మారుతోంది. ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు ద్వారా, ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.