Page Loader
Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు
తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు

Tirupati: తిరుపతిలో వర్షపాతం పెరుగుదల.. భవిష్యత్‌లో భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ శతాబ్దం చివరికి తిరుపతి జిల్లాలో వర్షపాతం పెరుగడంతో పాటు, భారీ వర్షాల రోజుల సంఖ్య గణనీయంగా అధికమవుతుందని ఐపీసీసీ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) మోడళ్ల ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాల రోజులు 30-40 వరకు పెరుగుతాయని, వార్షిక వర్షపాతం 8-32% మధ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దిల్లీకి చెందిన 'ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌' పరిశోధకుడు వెంకట్‌రమణ కాగిత, స్వీడన్‌లోని ఉప్పసల విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లతో కలిసి తిరుపతి జిల్లాలో వాతావరణ మార్పులపై అధ్యయనం చేపట్టారు. 1981-2010 మధ్య భారత వాతావరణశాఖ విడుదల చేసిన వర్షపాతం సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు.

Details

అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు 

2026 నుంచి 2100 వరకు కాలాన్ని మూడు విభాగాలుగా విభజించి పరిశీలించగా, మూడు దశలలోనూ వర్షపాతం పెరుగుతుందని తేలింది. 1981-2010 కాలంతో పోలిస్తే, 2100 నాటికి గ్రీన్‌హౌస్‌ వాయువుల అధిక ఉద్గారాల వల్ల వర్షపాతం 32% పెరుగుతుందని, మితంగా విడుదలైతే 19% పెరుగుతుందని అంచనా వేశారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య వర్షపాతం 21-35% వరకు పెరగనుంది. భవిష్యత్తులో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సంవత్సరానికి 3.3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. వేసవిలో ఈ పెరుగుదల 3.6 డిగ్రీల వరకు ఉండొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం దాటే తుపాన్లు తిరుపతిపై ప్రభావం చూపే అవకాశముంది. తిరుపతిలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 65% ఈశాన్య రుతుపవనాల కాలంలోనే కురుస్తోంది.

Details

సరైన ప్రణాళిక అవసరం

పీలేరు సమీపంలోని తిరుపతి భక్తుల రద్దీతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2031 నాటికి నగర జనాభా 10 లక్షలకు చేరుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా విస్తరిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం నుంచి రక్షించే సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెంకట్‌రమణ కాగిత సూచించారు.