
JP Nadda: అవసరం మేరకు యూరియా సరఫరా: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో యూరియా వినియోగం గణనీయంగా పెరిగిందని కేంద్ర ఎరువులు,రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. 2023-24 రబీ సీజన్‌తో పోలిస్తే 2024-25 రబీ సీజన్‌లో యూరియా వినియోగం 21 శాతం పెరిగిందని, 2024 ఖరీఫ్‌తో పోలిస్తే 2025 ఖరీఫ్‌లో 12.4 శాతం అధికంగా వాడినట్టు తెలిపారు. యూరియాను అధికంగా ఉపయోగించడం వల్ల భూమి సారానికి హానికరంగా మారుతున్నదన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలసి,రాష్ట్రానికి యూరియా కోటాను పెంచాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో,బుధవారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
వివరాలు
రాష్ట్రంలోయూరియా అధిక వినియోగంపై నడ్డా ఆందోళన
''తెలంగాణలోని రైతుల వాస్తవ అవసరాలను తీర్చేందుకు అవసరమైన మద్దతును అందిస్తామని'' మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా ఎరువుల సరఫరా జరగాలని ఆయన శాఖ అధికారులకు సూచించినట్లు వివరించింది. అయితే,రాష్ట్రంలోయూరియా అధిక వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి,సమతుల్యంగా వివిధ ఎరువులను వినియోగించడాన్ని ప్రోత్సహించాలి. అలాగే, ప్రత్యామ్నాయ ఎరువులు,సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ విధానాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు.
వివరాలు
దేశవ్యాప్తంగా 'పీఎం ప్రణామ్' పథకం అమలు
ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం 'పీఎం ప్రణామ్' పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ మిశ్ర స్పష్టం చేశారు. ఇక వ్యవసాయేతర అవసరాల కోసం ఎరువులను మళ్లిస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమంగా ఎరువులు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన సూచించారని శాఖ ప్రకటనలో పేర్కొంది.