S Jaishankar: సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయులను తిరిగి రప్పిస్తాం: జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ (S Jaishankar) న్యాయబద్ధమైన వలసలను భారత ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు.
సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్ళిన భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
నూతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొనడానికి అమెరికా (USA) వెళ్లిన జైశంకర్ కొంతమంది భారతీయ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా, ఇరు దేశాల సంబంధాలు, భారత విదేశాంగ విధానం వంటి వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
వివరాలు
చట్టవిరుద్ధ చర్యల వల్ల ఇతర నేరాలకు అవకాశాలు
''భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలకు గ్లోబల్ స్థాయిలో మరింత అవకాశాలు దక్కాలని మేం ఆశిస్తున్నాం. అందుకే న్యాయబద్ధమైన వలసలకు మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. అయితే, అక్రమ రవాణా లేదా న్యాయవిరుద్ధ వలసలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే చట్టవిరుద్ధ చర్యల వల్ల ఇతర నేరాలకు అవకాశాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితులు ఏ దేశానికైనా మంచివి కావు. చట్టవిరుద్ధ చర్యలు దేశానికి మంచి పేరు తీసుకురావు. అందుకే అమెరికా సహా ఏ దేశంలోనైనా అక్రమంగా ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి చట్టబద్ధంగా రప్పించేందుకు మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం,'' అని జైశంకర్ తెలిపారు.
వివరాలు
ఆ భారతీయుల వివరాలను కేంద్రం పరిశీలిస్తోంది
అక్రమంగా అమెరికాలో ఉన్న భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందించారు.
అమెరికా పంపించాలని భావిస్తున్న భారతీయుల వివరాలను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
కానీ, ప్రస్తుతం ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని వివరించారు.