LOADING...
India: లిపులేఖ్ సరిహద్దుపై భారత్-చైనా ఒప్పందం.. నేపాల్‌ అభ్యంతరం.. ఖండించిన భారత్‌
లిపులేఖ్ సరిహద్దుపై భారత్-చైనా ఒప్పందం.. నేపాల్‌ అభ్యంతరం.. ఖండించిన భారత్‌

India: లిపులేఖ్ సరిహద్దుపై భారత్-చైనా ఒప్పందం.. నేపాల్‌ అభ్యంతరం.. ఖండించిన భారత్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-చైనా దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలు చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో భాగంగా లిపులేఖ్‌ మార్గం ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే దీనిపై పొరుగు దేశం నేపాల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ నేపాల్‌ చేస్తున్న వాదనలకు ఆధారాలు లేవని స్పష్టంచేసింది. నేపాల్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లోక్‌ బహదూర్‌ ఛెత్రి ప్రకారం,మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధురా,లిపులేఖ్‌,కాలాపాణి ప్రాంతాలు తమ భూభాగంలోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలను తాము విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లోనూ స్పష్టంగా చూపించామని చెప్పారు.

వివరాలు 

1953లోనే లిపులేఖ్‌ మార్గం ద్వారా భారత్‌-చైనాల మధ్య వాణిజ్యం

అంతేకాకుండా ఈ అంశాన్ని చైనా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్‌ తీవ్రంగా స్పందించారు. లిపులేఖ్‌ మార్గం ద్వారా భారత్‌-చైనాల మధ్య వాణిజ్యం పునరుద్ధరించడంపై నేపాల్‌ అభ్యంతరం చెప్పడం అనవసరమని ఆయన అన్నారు. ఈ అంశంపై భారత వైఖరి ఎప్పటికీ స్పష్టంగా, స్థిరంగా ఉందని చెప్పారు. 1953లోనే లిపులేఖ్‌ మార్గం ద్వారా భారత్‌-చైనాల మధ్య వాణిజ్యం ప్రారంభమై, దశాబ్దాలపాటు కొనసాగిందని వివరించారు. తరువాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని, ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలనే ఉద్దేశంతో రెండు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు.

వివరాలు 

సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించేందుకు భారత్‌ సిద్ధం

నేపాల్‌ చేస్తున్న భౌగోళిక వాదనలకు చరిత్రాత్మక ఆధారాలు ఏవీ లేవని, కృత్రిమంగా గీయబడిన కొత్త సరిహద్దులను భారత్‌ ఎప్పటికీ అంగీకరించబోదని ఆయన తేల్చిచెప్పారు. అయితే, ఈ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కూడా హామీ ఇచ్చారు. ఇక, ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ భారత్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌లతో సమావేశమై పలు సరిహద్దు సమస్యలపై చర్చించారు.

వివరాలు 

నేపాల్‌ 2020లో సరికొత్త మ్యాప్‌ విడుదల

ఆ తర్వాత లిపులేఖ్‌, షిప్కి లా, నాథు లా మార్గాల ద్వారా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని ఇరుదేశాలు ఉమ్మడిగా ప్రకటించాయి. 2020లో నేపాల్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. అందులో లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంగా పేర్కొంది. అప్పట్లో కేపీ శర్మ వోలీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై తీర్మానం ఆమోదించి, పార్లమెంటులోనూ ఆమోదం పొందింది. అయితే భారత్‌ దీన్ని ఖండించినప్పటికీ, నేపాల్‌ మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.