LOADING...
Trade war: ట్రంప్ టారీఫ్స్.. భారత్ కు ఎఫ్-35 జెట్ విమానాలు రావా? 
ట్రంప్ టారీఫ్స్.. భారత్ కు ఎఫ్-35 జెట్ విమానాలు రావా?

Trade war: ట్రంప్ టారీఫ్స్.. భారత్ కు ఎఫ్-35 జెట్ విమానాలు రావా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తూ, అదనంగా పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తెలిసిందే. అంతటితో ఆగకుండా భారత్‌-రష్యా మధ్య ఉన్న బంధంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై భారత్ నిరాశకు గురైందని,రక్షణ ఒప్పందాల ఆమోదానికి ముందడుగు వేయాలని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ఆసక్తి చూపడం లేదని బ్లూమ్‌బర్గ్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం..

వివరాలు 

అగ్రరాజ్యంతో చర్చలు కొనసాగించాలన్న భారత్ ఉద్దేశం 

భారత్ మాత్రం చర్చలు కొనసాగించాలని కోరుకుంటోంది. అగ్రరాజ్యం నుంచి కొనుగోళ్లు పెంచే దిశగా భారత్ యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సహజ వాయువు కొనుగోళ్లతో పాటు కమ్యూనికేషన్ పరికరాలు,బంగారం దిగుమతులను పెంచే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కొనుగోళ్ల కారణంగా రానున్న మూడునాలుగు సంవత్సరాల్లో అమెరికాతో వాణిజ్య మిగులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నదని సమాచారం. అయితే,ట్రంప్ విధించిన సుంకాలకు తక్షణమే ఎదురు దెబ్బగా భారత్ చర్యలు తీసుకుంటుందా అనే దానిపై స్పష్టత లేదు. కానీ,కొత్త రక్షణ ఒప్పందాలపై మాత్రం మోదీ ప్రభుత్వం ముందడుగు వేయబోదని సమాచారం.

వివరాలు 

మోదీ పర్యటనలో ఎఫ్-35 విమానాల ప్రతిపాదన 

అమెరికా అధికారులు అందించిన సమాచారం ప్రకారం,అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారత్ ఆసక్తి చూపడంలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో భారత్ నుంచి అధిక స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి ఎగుమతులు ఆశించిన అమెరికాకు ఇది పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా,భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. మోదీతో సమావేశమైన తరువాత ట్రంప్ ప్రకటన చేశారు. భారత్‌తో అమెరికాకు సుమారు 4.5 వేల కోట్ల డాలర్ల వాణిజ్య లోటు ఉన్నదని గుర్తుచేశారు. దీన్ని తగ్గించేందుకు భారత్ చమురు,గ్యాస్,మిలిటరీ హార్డువేర్‌ను ఎక్కువగా కొనుగోలు చేయాలని వాషింగ్టన్ ఆశిస్తున్నదని వివరించారు.

వివరాలు 

భారత్‌తో విభేదాలు ఒక్క రాత్రికే పోవు 

కానీ, భారత్‌పై విధించిన సుంకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ తగాదాలన్నీ ఒక్కరాత్రిలోనే పరిష్కారం కావు అని ఒక అమెరికా అధికారి వ్యాఖ్యానించారు. బ్రిక్స్ సభ్యత్వం,రష్యాతో చమురు కొనుగోళ్ల వంటి అంశాలను ట్రంప్ గతంలోనే ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్‌తో చర్చలు జరుగుతున్నప్పటికీ,ఈ సంక్లిష్టమైన సమస్యలకు త్వరగా పరిష్కారం దొరకదని అన్నారు. భారత్‌-రష్యాల దీర్ఘకాల బంధం,బ్రిక్స్‌పై వ్యతిరేకత, వాణిజ్య ఒప్పందాల్లో భారత ప్రభుత్వం వ్యవసాయ,పాడిపరిశ్రమ ఉత్పత్తుల్లోకి అమెరికా ప్రవేశానికి అంగీకరించకపోవడం వంటి అంశాలే ట్రంప్ అసహనానికి కారణాలయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.