
SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ వ్యయాల పరంగా, సైనిక బలగాల పరంగా తులనాత్మకంగా విశ్లేషణ సాగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది.
పాకిస్థాన్ ఖర్చుతో పోలిస్తే భారత్ తొమ్మిది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది.
అయితే, చైనా వంటి మూడో అణ్వాయుధ దేశంతో పోలిస్తే భారత్ ఖర్చు తక్కువే. చైనా భారత కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తోంది.
వివరాలు
రక్షణ ఖర్చులో ఐదో స్థానంలో భారత్
కోల్డ్ వార్ ముగిసిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ వ్యయాలు వేగంగా పెరుగుతూ రికార్డు స్థాయిలో 2,718 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి.
దీని ప్రధాన కారణాలుగా యుద్ధాలు కొనసాగుతుండడం, భౌగోళిక, రాజకీయ అస్థిరతలను విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజా గణాంకాల ప్రకారం, అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తరువాత భారత్ రక్షణ ఖర్చులో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.
స్టాక్‌హోల్‌మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో ప్రపంచ సైనిక వ్యయం వాస్తవ విలువలో 9.4 శాతం పెరిగింది.
మొత్తం వ్యయంలో టాప్ 5 దేశాల వాటా దాదాపు 60 శాతం (1,635 బిలియన్ డాలర్లు) కాగా, భారత్ కూడా ఇందులో భాగమైంది.
వివరాలు
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా కొంత వెనక్కి వెళ్లినప్పటికీ వాస్తవాధీన రేఖ వద్ద సుమారు లక్ష మంది భారత సైనికులు మోహరించబడిన పరిస్థితి కొనసాగుతోంది.
ఒక సీనియర్ ఆర్మీ అధికారి "టైమ్స్ ఆఫ్ ఇండియా"తో మాట్లాడుతూ, ''రెండు అణ్వాయుధ దేశాలతో చురుకైన వివాదాల సరిహద్దులు కలిగిన ఏకైక దేశం భారత్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నుంచి వచ్చే ముప్పుల్ని ఎదుర్కొనడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
SIPRI విడుదల చేసిన టాప్ 10 దేశాల సైనిక వ్యయం ఇలా ఉంది:
అమెరికా - 997 బిలియన్ డాలర్లు
చైనా - 314 బిలియన్ డాలర్లు
రష్యా - 149 బిలియన్ డాలర్లు
జర్మనీ - 88 బిలియన్ డాలర్లు
భారత్ - 83 బిలియన్ డాలర్లు (రూ.6.5 లక్షల కోట్లు)
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) - 82 బిలియన్ డాలర్లు
సౌదీ అరేబియా - 80 బిలియన్ డాలర్లు
ఉక్రెయిన్ - 65 బిలియన్ డాలర్లు
ఫ్రాన్స్ - 65 బిలియన్ డాలర్లు
జపాన్ - 55 బిలియన్ డాలర్లు
ఈ జాబితాలో పాకిస్థాన్ 29వ స్థానంలో ఉంది. దాని సైనిక వ్యయం 10 బిలియన్ డాలర్లు మాత్రమే.
వివరాలు
భారత్ తన GDPలో కేవలం 1.9శాతం మాత్రమే రక్షణకు కేటాయిస్తోంది
భారత్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉన్నప్పటికీ, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో తగిన స్థాయిలో సమర్థవంతమైన సైనిక ప్రత్యుత్తరాన్ని అందించడంలో ఇంకా వెనుకబడుతోంది.
ఉదాహరణకు, 2025-26 రక్షణ బడ్జెట్ రూ.6.8 లక్షల కోట్ల(80 బిలియన్ డాలర్లు)ఉండగా,ఇందులో కేవలం 22 శాతం మాత్రమే ఆధునిక ఆయుధ వ్యవస్థలు,కొత్త ప్లాట్‌ఫారమ్‌ల కొనుగోలుకు వెచ్చించబడుతోంది.
మిగిలిన మొత్తం జీతాలు, పెన్షన్లు, రోజువారీ ఖర్చులకు వెచ్చించబడుతోంది,ఇందులో 34 లక్షల మందికి పైగా రిటైర్డ్ సైనికులకు పెన్షన్లు కూడా ఉన్నాయి.
భారత్ తన GDPలో కేవలం 1.9శాతం మాత్రమే రక్షణకు కేటాయిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనా మరియు పాకిస్థాన్ వంటి శత్రుదేశాల ఉనికి దృష్టిలో ఉంచుకుంటే ఇది తక్కువే, కనీసం 2.5 శాతం ఖర్చు అవసరమని వారు సూచిస్తున్నారు.
వివరాలు
భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు
అంతేకాక, స్వదేశీ రక్షణ రంగం బలహీనంగా ఉండటంతో, భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా కొనసాగుతోంది.
దీని వల్ల భారత్ తన వ్యూహాత్మక భద్రతా లక్ష్యాలను సాధించడానికి సరైన, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంలో వెనుకపడుతోంది.
ఈ కారణంగా భారత సైన్యం యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీ ట్యాంక్ మిసైళ్ల వంటి కీలక అంశాల్లో ఇంకా ఆధునిక సాంకేతికతల కొరతను ఎదుర్కొంటోంది.
రాత్రి సమయంలో యుద్ధ సామర్థ్యం పరంగా కూడా భారత బలగాలు మిగతా మహాశక్తులతో పోలిస్తే వెనుకబడి ఉన్నాయి.
వివరాలు
2024లో చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఏడాది వ్యవధిలో 7 శాతం పెంచింది
ఇక చైనా విషయానికి వస్తే, రెండు మిలియన్ల బలగాలతో తాను భూ, వాయు, సముద్ర రంగాలలో మాత్రమే కాకుండా అణు, అంతరిక్షం, సైబర్ రంగాల్లోనూ వేగంగా ఆధునికీకరణ చేపట్టింది.
2024లో చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఏడాది వ్యవధిలో 7 శాతం పెంచింది, ఇది 2015 తర్వాత నమోదైన అతిపెద్ద పెరుగుదల.
SIPRI నివేదిక ప్రకారం, చైనా 2024లో ఆధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆటోమేటెడ్ సబ్‌మెరైన్లు వంటి సాంకేతికతల అభివృద్ధిలో ముందంజలో ఉంది.
అంతేకాదు, చైనా తన అణు ఆయుధ సామర్థ్యాన్ని విస్తరించడమే కాకుండా, అంతరి, సైబర్ యుద్ధ రంగాల్లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసింది — అవే ఏరోస్పేస్, సైబర్‌స్పేస్ యూనిట్లు.