Page Loader
India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!  
అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!

India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా, భారత్ కీలకమైన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అమెరికాలో దాక్కొని, భారత్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో నిమగ్నమైన గ్యాంగ్‌స్టర్లను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు చర్యలు వేగవంతం చేయనుంది. ఈ క్రమంలో, అనేక గ్యాంగ్‌స్టర్ల వివరాలతో కూడిన జాబితాను అమెరికా ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. భద్రతా సంస్థలు ఈ విషయంపై సమగ్ర నివేదికను సిద్ధం చేశాయని జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్

ఈ జాబితాలో గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ వంటి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)వాంటెడ్ లిస్టులో ఉన్న నేరస్తుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి మార్గదర్శనాల ప్రకారం,విదేశాల్లో తలదాచుకున్న నేరగాళ్ల జాబితాను ఇప్పటికే కేంద్ర సంస్థలు సిద్ధం చేశాయి. అయితే, ఇటీవల అమెరికాలో ఉన్న నేరస్తులను ప్రత్యేకంగా గుర్తించి,వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనతో సహా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్,ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని ముంబయి పోలీసులు నిర్ధారించారు. అతని కదలికలకు సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు భారత పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని భారత్‌కు తిరిగి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది.

వివరాలు 

సమాచారం ఇచ్చే వారికి రూ.10లక్షల బహుమతి

అన్మోల్,ముంబయిలో సంచలనం సృష్టించిన బాబా సిద్దిఖీ హత్య కేసులోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. అంతేకాదు,2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్‌పై అభియోగాలు ఉన్నాయి. అతనిపై మొత్తం 18 కేసులు నమోదు కాగా,సమాచారం ఇచ్చే వారికి రూ.10లక్షల బహుమతిని ఎన్ఐఏ (NIA) ప్రకటించింది. గోల్డీ బ్రార్ అనే పేరుతో ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారతదేశంలో అత్యంత వాంఛిత నేరస్థుల్లో ఒకడు. అతను లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు.2022లో సిద్ధూ మూసేవాలా హత్యకేసులో అతని పేరు ప్రధానంగా వినిపించింది. అంతేకాదు,బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనలో కూడా అతని పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతానికి అతను కూడా అమెరికాలోనే తలదాచుకున్నట్లు సమాచారం.