
India: అమెరికాకు షాక్ ఇచ్చేలా భారత్ కీలక నిర్ణయం.. $3.6 బిలియన్ల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా,సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బోయింగ్ P-8I సముద్ర పర్యవేక్షణ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. 2021లో ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం 2.42 బిలియన్ డాలర్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. అయితే, ద్రవ్యోల్బణం, ట్రంప్ విధించిన టారిఫ్‌లు,ఇతర ఆర్థిక-రాజకీయ కారణాల వలన మొత్తం ఖర్చు దాదాపు 50% పెరిగి 3.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఒప్పందం నిలిపివేతపై భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ, సంబంధిత వర్గాలు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి.
వివరాలు
విమానాల కొనుగోలు ఆలస్యం వెనుక కారణాలు
ఖర్చులు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో ట్రంప్ విధించిన 25% టారిఫ్‌ల ప్రభావంతో బోయింగ్ విమాన భాగాలు, కాంపొనెంట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. దీని వలన ఏర్పడిన అదనపు వ్యయం నేరుగా భారత ప్రభుత్వంపై భారం మోపింది. P-8I విమానాల తయారీ శ్రేణిలో భారత్‌లో తయారు చేసిన లేదా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసిన కొన్ని భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భాగాలను అమెరికాకు దిగుమతి చేసుకునే సమయంలో కొత్త టారిఫ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితి బోయింగ్ ఉత్పత్తి మొత్తం వ్యయాన్ని పెంచి, చివరికి ఆ అదనపు ఖర్చు భారత ప్రభుత్వానికే భారం అవుతోంది.
వివరాలు
ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాల ఆధునికీకరణ
రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కొనుగోలు ప్రక్రియను నిలిపివేసి, ప్రాజెక్టును వ్యూహాత్మకంగా పునర్‌మూల్యాంకనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అలాగే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అవసరాలు.. ఇవన్నీ ఈ నిర్ణయంపై ప్రభావం చూపాయి. ఇదిలా ఉండగా, ఎయిర్ ఇండియా తమ పాత బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లను అమెరికాకు పంపి ఆధునికీకరణ (రెట్రోఫిట్టింగ్) పనులు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో పూర్తయిన మొదటి విమానం ఈ సంవత్సరం చివరినాటికి ఎయిర్ ఇండియాకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు మొత్తం 33 డ్రీమ్‌లైనర్‌లు ఉన్నాయి. వీటిలో 26 పాత 787-8లు, 7 ఆధునిక 787-9లు ఉన్నాయి.
వివరాలు
రెట్రోఫిట్ చేసిన ప్రతి విమానంలో 20 బిజినెస్ క్లాస్, 25 ప్రీమియం ఎకనమీ, 205 ఎకనమీ క్లాస్ సీట్లు
పాత మోడల్‌లోని తొలి డ్రీమ్‌లైనర్‌ను ఇప్పటికే అమెరికాలోని బోయింగ్ సముదాయానికి పంపారు. ఈ విమానాన్ని పూర్తిగా రీడిజైన్ చేసిన తరువాత, మిగతా విమానాల ఆధునికీకరణకు ఇది నమూనాగా ఉపయోగపడనుంది. రెట్రోఫిట్ చేసిన ప్రతి విమానంలో 20 బిజినెస్ క్లాస్ సీట్లు, 25 ప్రీమియం ఎకనమీ సీట్లు, 205 ఎకనమీ సీట్లు ఉండే మూడు-తరగతుల సీటింగ్ అమరిక ఉంటుంది. ఎయిర్ ఇండియా ప్రతి నెల రెండు డ్రీమ్‌లైనర్‌లను ఆధునికీకరణ కోసం పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ 2027 మధ్య నాటికి పూర్తవుతుందని అంచనా. ఈ పరిణామాలు భారత్-అమెరికా రక్షణ సంబంధాలపై మాత్రమే కాకుండా, భారత భవిష్యత్ రక్షణ కొనుగోలు విధానాలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.