LOADING...
Fresh Covid Cases: కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్‌ కేసులు.. 68మంది మృతి
కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్‌ కేసులు.. 68మంది మృతి

Fresh Covid Cases: కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్‌ కేసులు.. 68మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్‌ 19) మళ్లీ వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 300కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 324 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా దేశంలోని యాక్టివ్‌ కేసుల సంఖ్య 7 వేల మార్కును చేరుకుంటోంది. ఈ తాజా కేసుల్లో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రం ప్రభావితమైంది. అక్కడ ఒక్కరోజులోనే 136 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 129 కేసులు వెలుగుచూశాయి. కేరళలో కూడా 96 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

వివరాలు 

యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,815

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం దేశంలో అత్యధిక యాక్టివ్‌ కేసులు కేరళలో ఉన్నాయి. అవి మొత్తం 2,053. అనంతరం గుజరాత్‌ 1,109, పశ్చిమ బెంగాల్‌ 747, ఢిల్లీ 691, కర్ణాటక 559 యాక్టివ్‌ కేసులతో కొనసాగుతున్నాయి. తాజా గణాంకాలతో దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,815కి పెరిగింది. కోవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్కొక్కరు ఢిల్లీ, జార్ఖండ్‌, కేరళకు చెందినవారు. ఈ ఏడాది మొదలైన జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 68కు చేరుకుంది.

వివరాలు 

కేంద్రం జాతీయ స్థాయిలో మాక్‌ డ్రిల్స్‌

2024 ప్రారంభం నుండి ఇప్పటివరకు దేశంలో మొత్తం 7,644 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా,కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జాతీయ స్థాయిలో మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా,ఐసోలేషన్‌ బెడ్లు,వెంటిలేటర్లు,అత్యవసర ఔషధాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు కనిపిస్తున్న కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌,దాని ఉపశాఖ ఎన్‌బీ1.8.1 ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

వివరాలు 

ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కేసులు

తాజా సమాచారం ప్రకారం, కొత్తగా ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్‌ కేసులు కూడా దేశంలో నమోదవుతున్నాయి. భారత సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) అందించిన సమాచారం ప్రకారం, ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 163 కేసులు నమోదు అయ్యాయి. ఈ వేరియంట్‌ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం తమిళనాడు 16, కేరళ 15, గుజరాత్ 11, ఆంధ్రప్రదేశ్ 6, మధ్యప్రదేశ్ 6, పశ్చిమ బెంగాల్‌లో 6 కేసులు వెలుగు చూశాయి.