Page Loader
UN: ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌'ను ఎండగట్టిన భారత్ 
ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌'ను ఎండగట్టిన భారత్

UN: ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌'ను ఎండగట్టిన భారత్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి వేదికపై పాకిస్థాన్ వైఖరిని భారత్‌ తీవ్రంగా విమర్శించింది. భారతదేశం ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంటే,పాకిస్తాన్ మాత్రం మతతత్వ ధోరణులు,ఉగ్రవాద కార్యకలాపాల్లో మునిగిపోయి, తీవ్రమైన రుణభారంతో కుంగిపోయిన దేశంగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్‌ వ్యాఖ్యానించారు. 'అంతర్జాతీయ శాంతి,భద్రతను ప్రోత్సహించడం' అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతూ, అభివృద్ధి, శ్రేయస్సు, పురోగతికి ఓ మోడల్‌గా నిలుస్తోందని తెలిపారు. అయితే భారత పక్కనే ఉన్న కొన్ని దేశాలు పూర్తిగా విరుద్ధ దిశగా ప్రయాణిస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.

వివరాలు 

అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు తీసుకోవడమే పాకిస్తాన్ ప్రధాన కార్యక్రమం

ఐక్యరాజ్యసమితి లక్ష్యాల సాధనలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తోందని, శాంతియుత, సంపన్న ప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్నదని హరీష్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడుతున్న ఈ సందర్భంలో, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు తీసుకోవడమే ప్రధాన కార్యక్రమంగా మిగిలిందని హరీష్ వ్యంగ్యంగా అన్నారు. అంతర్జాతీయ సమాజం అనుమతించని విధానాలను అనుసరిస్తూ పాకిస్తాన్ ముందుకెళ్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

 26 మంది నిరాయుధ పౌరులను అమానుషంగా హత్య చేసిన ఉగ్రవాదులు 

గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన దాడిని హరీష్ గుర్తు చేశారు. ఆ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది నిరాయుధ పౌరులను అమానుషంగా హత్య చేశారని చెప్పారు. ఈ దారుణానికి భారత ప్రభుత్వం తక్షణ చర్యగా 'ఆపరేషన్ సిందూర్‌'ను ప్రారంభించిందని, ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు హరీష్ తెలిపారు.