
India: దలైలామా వారసుడి ఎంపిక ఆయన హక్కే : భారత్
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. 15వదలైలామాను ఎంపిక చేసే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని, ఆ ప్రక్రియలో చైనా సహా మరెవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. "దలైలామా వారసుడి ఎంపిక అంశంలో జోక్యం చేసుకునే అధికారాన్నిఎవరూ కలిగివుండరు.ఆ నిర్ణయం పూర్తిగా దలైలామా గారికే చెందుతుంది లేదా సంబంధిత మత సంస్థే తీసుకుంటుంది. దలైలామా స్థానం కేవలం టిబెటన్లకే కాదు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినది"అని రిజిజు స్పష్టం చేశారు.
వివరాలు
త్సుగ్లాగ్ ఖాంగ్ ఆలయంలో దలైలామా 90వ జయంతి కార్యక్రమాలు
బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న త్సుగ్లాగ్ ఖాంగ్ ఆలయంలో దలైలామా 90వ జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు భారత్ తరఫున కిరణ్ రిజిజుతో పాటు జనతా దళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్ హాజరయ్యారు. బుధవారం దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందంటూ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్ దలైలామాను గుర్తించే అధికారాన్ని కేవలం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే ఉందని, ఈ విషయంలో మిగిలినవారెవరికీ జోక్యం చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన వచ్చాక కొద్దిగంటల వ్యవధిలోనే చైనా స్పందించింది. దలైలామా ఎంపికపై తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేసింది.
వివరాలు
1950లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా
వారసుడిని గుర్తించే ప్రక్రియను చైనా విధానాల ప్రకారమే నిర్వహించాలంటూ జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 1950లో టిబెట్‌ను చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ప్రస్తుత దలైలామా భారత్‌లోని ధర్మశాలలో శరణు పొందుతున్నారు. టిబెట్‌పై పట్టు సాధించేందుకు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ, దలైలామా మాత్రం ఈ ఎత్తుగడలను గమనించి, తన వారసుడి ఎంపిక పూర్తిగా తానే నిర్వర్తిస్తానని స్పష్టంగా వెల్లడించారు.