
Bhabesh Chandra Roy: బంగ్లాదేశ్'లో హిందూనేత హత్యపై భారత్ సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిన తరువాత అక్కడి మైనారిటీలు,ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి.
ఈ తరహా హింసాకాండలకు తాజా ఉదాహరణగా, ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
భబేశ్ చంద్ర రాయ్ అనే 58 ఏళ్ల హిందూ వ్యక్తిని గురువారం అనుమానాస్పదంగా దుండగులు కిడ్నాప్ చేసి,అనంతరం అమానుషంగా హత్య చేశారు.
ఈ విషయంలో భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా స్పందిస్తూ..భబేశ్ చంద్ర రాయ్ కిడ్నాప్, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఈఘటన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న నిరంతర హింసకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
దుండగులు శిక్షల బెంగ లేకుండా స్వేచ్ఛగా..
ఇలాంటి నేరాలపై గతంలో కూడా చర్యలు తీసుకోకపోవడంతో దుండగులు శిక్షల బెంగ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.
హిందువులతో పాటు అన్ని మతపరమైన మైనారిటీలు భద్రతతో జీవించేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి నెపాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని జైస్వాల్ తేల్చిచెప్పారు.
ఈ ఘటన గురువారం జరిగింది. భబేశ్ చంద్ర రాయ్ ఇంట్లో ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా అపహరించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా,నరబరి గ్రామంలో భబేశ్ చంద్ర రాయ్ గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న స్థితిలో కనిపించారు.
వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
వివరాలు
హిందువుల రక్షణలో మోదీ విఫలమయ్యారు: మల్లికార్జున ఖర్గే
ఈ దారుణ హత్యపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింస నిరంతరంగా కొనసాగుతోందని, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా మారుతున్నారని చెప్పారు.
భబేశ్ చంద్ర రాయ్ హత్య ఈ విషయానికి ఓ స్పష్టమైన ఉదాహరణ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్‌తో చిరునవ్వులతో సాగించిన చర్చలు ఫలప్రదం కాలేదని ఖర్గే విమర్శించారు.
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం, కేవలం గత రెండు నెలల వ్యవధిలోనే హిందువులపై 76 దాడులు జరిగాయని, అందులో 23 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు.
అంతేకాదు, ఇతర మత మైనారిటీలపై కూడా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.