
Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్ స్పెషల్ బ్రీఫింగ్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాద ముఠాలకు మద్దతుగా నిలుస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
'ఆపరేషన్ సిందూర్' పేరుతో శత్రుదేశంపై అనేక మార్గాల్లో దెబ్బతీసిన న్యూఢిల్లీ, ఇప్పుడు పాకిస్థాన్‌పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తీసుకురావడంపై దృష్టిసారించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అనేక దేశాల సైనిక రాయబారులకు ప్రత్యేకంగా వివరాలు అందించనున్నది.
ఇప్పటికే భారత్‌లో ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సహా పలు దేశాల రక్షణ అధికారులకు, రాయబారులకు కేంద్రం సమన్లు పంపించింది.
మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు న్యూఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన ప్రధాన అంశాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనున్నారు.
వివరాలు
ఇతర దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవాలని కోరనున్న కేంద్ర ప్రభుత్వం
ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తీసుకున్న ముందడుగు, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు తదితర అంశాలపై వారికి సమగ్రమైన అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.
పాకిస్థాన్‌పై జరిపిన మిలిటరీ చర్యలకు ఉన్న స్పష్టమైన కారణాలను వివరించే క్రమంలో, ఆయా దేశాలు భారత్‌కు మద్దతుగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం.
ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, రక్షణశాఖకు చెందిన ప్రముఖ అధికారులు హాజరయ్యే అవకాశముంది.
వివరాలు
బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం
బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం కలిగింది.
భద్రతాపరంగా తీసుకోవాల్సిన తదుపరి వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మే 19న పార్లమెంటరీ కమిటీ సమావేశం
ఇక మరోవైపు, విదేశాంగ పార్లమెంటరీ స్థాయి కమిటీ సభ్యులతో కూడిన సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది.
ఈ సమావేశానికి చైర్మన్‌గా శశి థరూర్ వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన వివరాలను సభ్యుల ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది.